అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకొంటోందని ఆరోపణలు వచ్చాయి. అదే విదంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పొరుగు (రాష్ట్రాల) పార్టీలు జోక్యం చేసుకొంటున్నాయని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.
అయితే తెలంగాణ వేరే దేశంలో లేదు… పొరుగు రాష్ట్రమే కనుక పొరుగు పార్టీలు ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి లేదా తమ రాజకీయ ప్రయోజనాలు, అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి.
ఉదాహరణకు కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తమిళనాడులోని అధికార డిఎంకె పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి, తెలంగాణలో స్థిరపడిన తమిళ ఓటర్లందరూ కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసింది.
టిడిపి కాంగ్రెస్‌కు మద్దతుగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొందని బిఆర్ఎస్ వాదిస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఎన్నికల బరి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారం చేసి వెళుతున్నారు.
ఈవిదంగా పొరుగు పార్టీలు వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయడం వలన తెలంగాణలో స్థిరపడిన ఆయా రాష్ట్రాల ఓటర్లు ప్రభావితం కావచ్చు లేదా పొరుగు పార్టీల వ్యూహాలు, వాటి నేతలే ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు.
అందుకే దేశంలో అన్ని పార్టీలు కట్టకట్టుకొని వచ్చి తెలంగాణపై దాడి చేస్తున్నాయంటూ బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కానీ పొరుగు రాష్ట్రాలలో తమ బిఆర్ఎస్ పార్టీని విస్తరించడానికే ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ పార్టీగా మార్చుకొన్నామని మరిచిపోయారు. ఇప్పటికే ఆంధ్రా రాజకీయాలలో వేలు పెట్టి ప్రభుత్వం మారేలా చేశామని, మహారాష్ట్రలో కూడా ప్రవేశించి అక్కడా రాజకీయాలు చేస్తున్నామనే విషయం గుర్తులేన్నట్లు బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు.
కానీ వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా పొరుగు పార్టీలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయకుండా ఉండవు. తెలంగాణ ఎన్నికలపై వాటి ప్రభావం ఎంతో కొంత ఉండకా తప్పదు.






