గులాబీ నేతలకు ఎన్నికలు రాగానే ఆంధ్రప్రదేశ్ vs తెలంగాణ అంటూ విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ ను లేపడం, ఎన్నికల హడావుడి పూర్తవ్వగానే సెంటిమెంట్ కు ఆయింట్ మెంట్ పూసి గులాబీ కండువా కప్పడం ఒక ఆనవాయితీగా మారిపోయింది.
ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్దం గడిచిపోయినా ఇంకా అదే సెంటిమెంట్ ధోరణిలో ప్రజలను మోసం చేసి ఓట్ల రాజకీయాలతో అధికారం సాధించుకుందాం అనుకున్న బిఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో గట్టి గుణపాఠమే చెప్పారు తెలంగాణ ఓటర్లు. అయినా వీరి తీరులో ఎటువంటి మార్పు రాలేదని మరోసారి స్పష్టం చేసుకున్నారు హరీష్ రావు.
ఇన్నాళ్లుగా తెరవెనుక సాగిన వైసీపీ – బిఆర్ఎస్ బంధం ఈ మధ్యే అధికారికంగా బయటపడింది. తెలంగాణ రాజకీయాలలో ఏపీ నాయకుల ప్రభావం ఉండకూడదు అంటూ కంచెలు వేసే బిఆర్ఎస్ నేతలు ఏపీ రాజకీయాలలోకి మాత్రం చొచ్చుకువస్తారు. ఒక పక్క కేటీఆర్, కేసీఆర్, మరో పక్క ఎంఐఎం ఏపీలో జగన్ గెలుపు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ మరో కొత్త వాదన తెర మీదకు తెచ్చారు హరీష్ రావు.
ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు మరికొంతమంది కలిసి హైద్రాబాద్ ను మరికొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించడానికి పావులు కదుపుతున్నారని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన పోరాటమని, బిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేకపోతే తెలంగాణకు అన్యాయం జరిగే ప్రమాదముందంటూ మరోసారి తెలంగాణ సెంటి మెంట్ ను పండించే పనిలో ఉన్నారు బిఆర్ఎస్ నేతలు.
అలాగే ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ఎం జరిగిన అందుకు బాబే కారణమంటూ చెప్పుకుంటున్న వైసీపీ మాదిరే ఇప్పుడు బిఆర్ఎస్ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఏం జరిగినా, జరగాలనుకున్న అందుకు బాబే కారణమంటూ వాదించడం చూస్తుంటే వైసీపీ రోగం బిఆర్ఎస్ కు వ్యాపించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశం మీద ఏపీలో కనీసం చర్చ కూడా జరగడం లేదు.
కానీ హైద్రాబాద్ ను ఉమ్మడి రాజధాని గా చేయడానికి బాబూ చక్రం తిప్పుతున్నాడు అంటూ హరీష్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ కూటమే అనేది బిఆర్ఎస్ నాయకులు చెప్పాలనుకుంటున్నారా..? ఉమ్మడి రాజధాని గా చేయాలన్నా.. ఉమ్మడి ఆస్తిని ఒకరికే దోచి పెట్టాలన్నా అది కేవలం అధికారం, పదవి ఉంటేనే సాధ్యం. 2019 ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి హోదాలో హైద్రాబాద్ వెళ్లిన జగన్ ఒకే ఒక్క సంతకం తో ఏపీ ఆస్తులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేసారు.
అలాగే ఇప్పుడు హరీష్ చెపుతున్నట్టుగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇంత పెద్ద రాజకీయ నిర్ణయం తీసుకోవాలి అంటే బాబు కి కూడా ముఖ్యమంత్రి పదవి ఉండాలసిందేగా..? అంటే బాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని హరీష్ చెప్పదలచుకున్నారా..? అంటే ఏపీలో ఎన్నికలకు ముందే హరీష్ రావు ఫలితాలు అంచనా వేసారా..? హరీష్ వ్యాఖ్యలు ఒకరకంగా టీడీపీ కూటమికి కలిసి వచ్చే అంశాలే. టీడీపీ ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో సెంటిమెంట్ కోసం ప్రయత్నిస్తున్న హరీష్ వ్యాఖ్యల వలన తెలంగాణలో టీడీపీ కొత్తగా కోల్పోయేది ఏమి ఉండదు.
ఏపీలో ఒక పక్క రాష్ట్రం వచ్చి పదేళ్లవుతున్నా ఇప్పటికి రాజధాని లేదు అనే ఒక ఎమోషన్ లో ఉన్న ప్రజానీకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి తీసుకువస్తాం అంటూ బాబు, పవన్, లోకేష్ హామిలిస్తుంటే హరీష్ ఇలా హైద్రాబాద్ పై ఉమ్మడి రాజధాని అంటూ కుట్రలు జరుగుతున్నాయి అంటూ వాదించడం తన మిత్రపక్షమైన వైసీపీకి అది ఎదురుదెబ్బే అవుతుంది.




