మరో 4-5 నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో ఎవరో మంత్రదండం తిప్పిన్నట్లు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు హటాత్తుగా మారిపోయాయి.
గత మూడేళ్ళుగా సిఎం కేసీఆర్‌కు, బిఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై హటాత్తుగా పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పలువురు సీనియర్ నేతలు ఆయనను మార్చాలని పట్టుబడుతున్నారు. బిజెపి అధిష్టానం వారి ఒత్తిడికి తలొగ్గి అందుకు సిద్దపడగా, పార్టీ అధ్యక్ష పదవి కోసం పార్టీ నేతల మద్య కీచులాటలు మొదలయ్యాయి!
సీనియర్ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా ఢిల్లీలోనే మీడియా సమావేశంలో బండి సంజయ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చి పార్టీలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి వంటి కొంతమంది సీనియర్ నేతలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది!
ఇంతకాలం ఫిరంగిలా గర్జించిన తెలంగాణ బిజెపి ఇప్పుడు ‘బ్యాక్ ఫైర్’ అవుతుండటం యాదృచ్చికమా లేక పార్టీలో కేసీఆర్ కోవర్టుల పనా లేక బిజెపి-బిఆర్ఎస్‌ల మద్య రహస్య అవగాహనలో భాగామా? అనేవి సమాధానం దొరకని భేతాళ ప్రశ్నలే.
ఇక కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి అక్కడ అధికారంలోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని చాలా హడావుడి చేస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు ఎంత హడావుడి చేసినా వారి డీఎన్ఏలోనే అనైక్యత ఉంది కనుక కాంగ్రెస్ పార్టీని వారే కలిసికట్టుగా ఓడించుకొంటారని అందరికీ తెలుసు. అధికారంలో లేకపోయినా పదవుల కోసం వారిలో వారే కీచులాడుకొనే కాంగ్రెస్‌ను ఓడించడమే బిఆర్ఎస్‌కు సులువు.
ఇదీగాక కేంద్రం మద్దతు ఉన్న బిజెపిని ఎదుర్కోవడం కంటే అలాంటి అవకాశం లేని కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే బిఆర్ఎస్ పార్టీకి సులువు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి పైకి లేపుతున్నారని బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి నేతలు ఆరోపిస్తుంటారు. అయినా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం బిఆర్ఎస్‌కు కూడా చాలా అవసరమే.
ఎందుకంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా ఒకవేళ కాంగ్రెస్‌లో కొంతమంది గెలిచి ఎమ్మెల్యేలైనప్పటికీ ఎన్నికల తర్వాత వారందరూ బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతుంటారు. ఈ విషయం తెలంగాణ ప్రజల మనసులలో బలంగా నాటుకొంది. నాటుకొనేలా చేసింది బిఆర్ఎస్ పార్టీ.
శాసనసభ ఎన్నికలకు ముందు అధికార బిఆర్ఎస్ పార్టీకి హటాత్తుగా చాలా అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ తన మంత్రదండం తిప్పి ఈ మార్పు తెచ్చారా లేక ఆయన చేసిన యజ్ఞాలు, యాగాలు ఫలించి ఈ మార్పు వచ్చిందా? తెలీదు కానీ బిఆర్ఎస్ పార్టీకి ఇక అన్నీ మంచి శకునములే అని అనుకోవచ్చు.



