డొక్క మాడిపోతోందిక్కడ… సాధికార యాత్ర అవసరమా?

Dokka Manikya Vara Prasad

జగన్మోహన్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చాలా ప్రాధాన్యం ఇస్తారని చాటింపు వేసేందుకు మంత్రులను బస్సులు ఎక్కించి సామాజిక సాధికార యాత్రలు చేయిస్తున్నారు. అయితే ముందు పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలను జగన్‌ గౌరవిస్తున్నారా?అంటే లేదనే చెపుతున్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.

ఈ బస్సు యాత్రలో భాగంగా శనివారం తాడికొండ సభలో ఆయన వేదికపైనున్న సీనియర్ నేతలను ఉద్దేశ్యించి, “ఒక్కసారి నాకు సిఎం జగన్మోహన్‌ రెడ్డిని కలిసేందుకు అవకాశం కల్పించండి సార్,” అని అడగడంతో అందరూ షాక్ అయ్యారు.

ADVERTISEMENT

కాంగ్రెస్‌, టిడిపిల మీదుగా వైసీపిలో వచ్చిపడిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒకపుడు మంత్రిగా ఓ వెలుగువెలిగారు. డొక్కా రాజకీయాలలో రాటు తెలినవారు. పైగా దళిత రాజకీయ నాయకులలో ఆయన చాలా సీనియర్ కూడా. అటువంటి వ్యక్తికి జగన్మోహన్‌ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ లభించడం లేదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

వైసీపిలో చేరిన తర్వాత జగన్‌ ఆయనని తాడికొండ నియోజకవర్గం సహ ఇన్‌చార్జిగా నియమించినప్పటికీ ఆ తర్వాత ఆయనను తప్పించేసి, హోంమంత్రి మేకతోటి సుచరితని సమన్వయకర్తగా నియమించారు. కానీ డొక్కాకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ డొక్కా ఇంతకాలం మౌనంగా ఉండిపోయారు.

కానీ ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికలకి పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తుండటంతో ఒక్కసారి స్వయంగా ఆయనను కలిసి టికెట్‌ గురించి మాట్లాడాలనుకొన్నారు. కానీ ఎంత ప్రయత్నించినా జగన్‌ అపాయింట్మెంట్ లభించలేదు.

మరి జగన్మోహన్‌ రెడ్డిని ఏవిదంగా కలవాలో తెలియక డొక్కా మాణిక్య వరప్రసాద్, ఈ వేదిక మీద ప్రజల ముందే జగన్‌ అపాయింట్మెంట్ ఇప్పించమని సీనియర్లను అడిగేశారు. ఆయన తన మనసులో బాధని ఇలా బయటపెట్టుకొన్నప్పటికీ, ఓ సీనియర్ దళిత నాయకుడిని జగన్మోహన్‌ రెడ్డి పట్టించుకోవడం లేదనే విషయం బయటకు పొక్కింది. అదీ… సామాజిక సాధికార యాత్ర వేదిక మీద!

మరి పార్టీలో ఉన్న సీనియర్ దళిత నాయకుడు డొక్కానే జగన్మోహన్‌ రెడ్డి పట్టించుకోనప్పుడు మిగిలిన మంత్రుల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో నిరుపేద దళితులను పట్టించుకొంటారా?అనే సందేహం కలిగితే అది ఆయన తప్పు కాదు. డొక్క మాడితే ఎవరైనా ఇలాగే మాట్లాడుతారు.

ADVERTISEMENT
Latest Stories