దువ్వాడ… ఇప్పుడు చిన్న పిల్లోడు కాదు

Duvvada-Srinivas-Affair Controversy

రాజకీయాలలో ఒక్కో సమయంలో ఒక్కొరి పేరు మారుమ్రోగిపోతుంది. గత 5 ఏళ్ళలో కొంతకాలం గోరంట్ల మాధవ్, ఆ తర్వాత కొడాలి నాని, ఆ తర్వాత వరుసగా గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, సజ్జల, విజయసాయి, బాలినేని ఇలా ఒక్కొక్కరి హవా నడిచింది.

ఇటీవల యావత్ మీడియా, సోషల్ మీడియా వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ స్టోరీతో ప్రజలను పులకరింపజేశాయి. అయితే వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ఎందుకో ఆ పులకరింపు కలగలేదు. అసహనం కలిగింది.

ADVERTISEMENT

ఇదివరకు జగన్‌ టెక్కలిలో పర్యటించినప్పుడు దువ్వాడ భుజంపై చేయి వేసి దువ్వాడ ఎలాంటివాడో మీ అందరికీ తెలుసు… చాలా సౌమ్యుడు, చిన్న పిల్లోడు, శ్రీరామచంద్రుడు అంటూ సర్టిఫై చేశారు. కానీ ఇప్పుడు ఆ సర్టిఫికెట్స్ ఉపసంహరించుకున్నారు.

తాజాగా పార్టీ పదవుల భర్తీలో దువ్వాడ శ్రీనివాస్‌ని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపి ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించేసి ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించడంతో సరిపెట్టిన్నట్లున్నారు.

దువ్వాడ శ్రీనివాస్‌ కూడా ఇది అర్ధం చేసుకోగలరు. పైగా ఇన్‌చార్జి బాధ్యతలను తప్పించడం వలన ఇప్పుడు మరింత ‘మాధుర్యంగా’ జీవితం గడపవచ్చు. కనుక ఆయన జీవిత భాగస్వామి (?) కూడా తప్పక సంతోషించవచ్చు. పనిలో పనిగా నారీ నారీ నడుమ మురారి స్టోరీకి క్లైమాక్స్ ఏవిదంగా ఉండాలో తాపీగా ఆలోచించుకోవచ్చు కూడా.

మంగళగిరి సీటు ఇస్తానని గంజి చిరంజీవికి జగన్మోహన్‌ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు కనుక పాప పరిహార్ధం ఆయనకు చేనేత విభాగం అధ్యక్షుడుగా నియమించారు. అంటే ప్రభుత్వంలో శాఖలు ఉన్నట్లే వైసీపిలో కూడా చేనేత శాఖని సృష్టించారనుకోవచ్చు.

ఆ లెక్కన పరిశ్రమల శాఖకు గుడివాడని, పౌరసరఫరాల శాఖకి ద్వారంపూడిని, దేవాదాయ శాఖకి రోజా… ఇలా మళ్ళీ పార్టీలో కూడా శాఖలు ఏర్పాటు చేసుకోవచ్చన్నమాట.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వదులుకోవడానికి కూడా జగన్‌ సిద్దపడి ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్‌ ఇచ్చారు. కానీ వైసీపిలో నుంచి టిడిపిలోకి మారి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఓడిపోయారు. కనుక ఆయనకు కాంపన్‌సెషన్‌గా వైసీపి అనుబంధ విభాగాలకు ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

అలాగే మాజీగా మారిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిలని వైసీపి ప్రధాన కార్యదర్శులు (సమన్వయం)గా నిర్మించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి స్థానంలో బొత్స సత్యనారాయణని తీసుకువస్తున్నట్లున్నారు.

ఎన్నికలలో ఓటమి తర్వాత మూడు ప్యాలస్‌ల మద్య తిరుగుతున్న జగన్‌ సీబీఐ అనుమతిస్తే లండన్‌ వెళ్ళాలనుకుంటున్నారు. ఆలోగా పార్టీలో ఈ మార్పులు చేర్పులు చేశారు కనుక ఒకవేళ లండన్‌ వెళితే తిరిగివచ్చే వరకు పార్టీ సాఫీగా సాగుతుంటుంది.

ADVERTISEMENT
Latest Stories