రాజకీయ దురాశతోనే కేసీఆర్‌ ఒంటరయ్యారు… నిజమే కదా?

Eatala-Rajendar Comments On KCRఒకప్పుడు కేసీఆర్‌తో భుజం భుజం కలిపి తెలంగాణ ఉద్యమాలలో పోరాడి, ఆ తర్వాత రెండుసార్లు కేసీఆర్‌ మంత్రివర్గంలో ఈటల రాజేందర్‌ మంత్రిగా పనిచేశారు. చివరికి కేసీఆరే ఆయనను ప్రభుత్వం, పార్టీ నుంచి బహిష్కరించడంతో బిజెపిలో చేరారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలలో ఈటల రాజేందర్‌ని ఓడించి ఆయన రాజకీయ సమాధి చేసేందుకు కేసీఆర్‌ సర్వశక్తులు ఒడ్డారు. కానీ ఈటల రాజేందర్‌ గెలిచారు.

కనుక కేసీఆర్‌ గురించి ఆయన కంటే మరెవరికీ బాగా తెలియదంటే అతిశయోక్తి కాదని భావించవచ్చు. ఈరోజు ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయ దురాశ కారణంగానే కేసీఆర్‌ ఒంటరివారయ్యారు. ఆయన ప్రత్యేక విమానాలు వేసుకొని దేశమంతా తిరిగారు. అన్ని పార్టీలను కలిశారు. తన నాయకత్వాన్ని అంగీకరిస్తే వాటి ఎన్నికల ఖర్చును నేనే భరిస్తానని చెప్పారు. కానీ ఆయనను అటువాళ్ళు నమ్మలేదు…. ఇటువాళ్ళు నమ్మలేదు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా ఆయనను నమ్మడం లేదు. ఈ కారణంగా దేశ రాజకీయాలలో ఆయన ఒంటరివారైపోయారు. మరోవిదంగా చెప్పాలంటే కేసీఆర్‌ మిగిలిన పార్టీల నుంచి, ప్రజల నుంచి తానే వేరుపడ్డారు. దీనికి కారణం ఆయన రాజకీయ దురాశ. చేతిలో అధికారం, బోలెడంత డబ్బు ఉందని ఎగిసిపడినందుకే కేసీఆర్‌కు ఈ దుస్థితి వచ్చింది,” అని ఈటల రాజేందర్‌ అన్నారు.

ADVERTISEMENT

ఈటల రాజేందర్‌ బిజెపిలో ఉన్నారు కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్‌ మీద అసూయతో ఇటువంటి విమర్శలు చేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ కేసీఆర్‌ గురించి ఈటల రాజేందర్‌ చేసిన విశ్లేషణ నూటికి నూరు శాతం నిజమని అందరికీ తెలుసు.

ADVERTISEMENT
Latest Stories