ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టగా, అందులో ముంబైలో ఒకే అడ్రస్ తో 700 సూట్ కేస్ కంపెనీలను ఈడీ గుర్తించింది. వాటిల్లో “రాజేశ్వర్ ఎక్స్ పోర్ట్ సంస్థ” కూడా ఉందని, అది వైఎస్ జగన్ కు సంబంధించిందని తేల్చింది. ఆ సంస్థ ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఈడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
సూట్ కేస్ కంపెనీలతో జగన్ కున్న సంబంధాలపై ఆరా తీసే ప్రయత్నం చేస్తోంది. నల్లధనం, అక్రమ లావాదేవీలపై ఉక్కు పాదం మోపిన కేంద్ర ప్రభుత్వం, అక్రమార్కుల భరతం పట్టడానికి అన్ని అంశాలను పరిశీలిస్తూ ముందుకు వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పలు ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. దీంతో రాబోయే రోజులన్నీ వైకాపా అధినేత వైఎస్ జగన్ కు నిద్ర లేని రాత్రులను మిగల్చనున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
కడప జిల్లాలో అన్ని వర్గాలూ ఒక తాటిపై నడుస్తున్నాయని, అభివృద్ధే థ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కడప జిల్లాలో ఇక జగన్ ఆధిపత్యాన్ని కొనసాగనివ్వబోమని గంటా స్పష్టం చేశారు. మరో వైపు ఈడీ నుండి ఊహించని ఈ షాక్ తో వైసీపీలో కలకలం మొదలైంది. ఓ పక్కన వైసీపీ నుండి టిడిపిలోకి వెళ్ళిన వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం వైసీపీ వర్గాలను తీవ్రంగా నిరుత్సాహపరచడం ఒక అంశమైతే, మరో వైపు జగన్ పై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.



