ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తన పార్టీ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు జగన్ చేసిన ఏ ఒక్క ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడు సార్లు యత్నించిన జగన్… మూడు సార్లూ విఫలమైన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో జగన్ అంచనా వేసిన వ్యూహాలకు ఈసీ మరో గట్టి షాక్ ఇచ్చినట్లయ్యింది.
మరో రెండు నెలల్లో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఎమ్మెల్యేలు తమ ఓటును పార్టీ ప్రతినిధికి చూపించి మరీ ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సొంత పార్టీ అభ్యర్థికి కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి ఓటేసే ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ధిక్కరించినట్లు తేలిపోతుంది. దీనిని సాక్ష్యంగా చూపి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చన్నది జగన్ అసలు ఎత్తుగడ. దీని తర్వాత అయినా సదరు ఎమ్మెల్యేల హోదా రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలన్నది జగన్ మరో యోచనగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే జగన్ ఆశలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది. రాజ్యసభ ఎన్నికల్లో విప్ చెల్లదని, వేరే పార్టీకి ఓటేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం కుదరదని తాజాగా ఈసీ చేసిన వ్యాఖ్యలు జగన్ ను కృంగదీసినట్లయ్యింది. అలాంటి ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చిని, సభ్యత్వాలను రద్దు చేయడం మాత్రం కుదరదని తేల్చిచెప్పింది. ఈసీ మార్చిన నిబంధన మేరకు విప్ ను ధిక్కరించే ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే… అంతిమంగా పార్టీ నుంచి సస్పెండ్ మాత్రమే కుదురుతుంది. ఇలా విప్ ధిక్కరించే ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అది ‘వరం’గా మారుతుంది. దీంతో ఉన్న ఒక్క అవకాశం చేజారడంతో డైలామాలో పడడం జగన్ వంతయ్యింది.



