ఉల్లిపాయలు తరుగుతుంటే ఎలాగూ కన్నీళ్ళు తప్పవు. ఒక్కోసారి వాటి ధరలు పెరిగినప్పుడు కూడా తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఉల్లికి కనీసధర రాక రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
కర్నూలులో టమోటా రైతులు కూడా కేజీ ఒక్క రూపాయికి అమ్ముకోవలసి వస్తున్నందుకు ఎంతగానో బాధ పడుతున్నారు.
ట్రంప్ సుంకాలు, ఆంక్షల వలన రాష్ట్రంలో ఆక్వా రైతులు కూడా ఏమి చేయాలో పాలుపోక బాధపడుతున్నారు.
టీడీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారిస్తామని చెపుతూనే ఉంది. ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్ గోదాములు నిర్మిస్తామని, వివిధ ఆహార ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపిస్తామని చెపుతోంది.
అలాగే మార్కెటింగ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కొరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెపుతోంది. కానీ ఈ హామీలు ఇంకా ఆచరణలోకి రాలేదని రైతుల కన్నీళ్ళు స్పష్టం చేస్తున్నాయి.
ఉల్లి, టమాటో రైతుల సమస్యల్ని వైసీపీ నేతలు, వారి మీడియా పదేపదే ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నారు. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఉల్లి రైతుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఆమెని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు, వారి మీడియా, వైఎస్ షర్మిల ఈ పేరుతో రాజకీయాలు చేస్తుండవచ్చు గాక. కానీ ఆ రైతులు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారనేది వాస్తవమే కదా?
ఉల్లి ధరలు పెరిగితే ప్రజాగ్రహానికి గురయ్యి ఎన్నికలలో నష్టపోతామని ఆందోళన చెంది వెంటనే చర్యలు చేపట్టే ప్రభుత్వాలు, ఉల్లి, టమాటో, ఆక్వా రైతులు నష్టపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?
ట్రంప్ సుంకాలు పెంచేసి ఆంక్షలు విధిస్తే ప్రధాని మోడీ కూడా ఏమీ చేయలేరు కనుక జీఎస్టీ తగ్గించి పండగ చేసుకోమన్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు ‘సూపర్ సిక్స్..సూపర్ హిట్ అంటున్నారు. కానీ రైతులు రోడ్లపైకి వచ్చి అడుగుతుంటే దానిని రాజకీయమని కొట్టిపడేయలేరు. కనుక వారి సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి, పరిష్కారించగల నేర్పు, సామర్ధ్యం, చేతిలో అధికారం, యంత్రాంగం అన్నీ ఉన్న సిఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఏం సమాధానం చెపుతారో? వారి సమస్యలు ఎప్పటికి పరిష్కరిస్తారో?




