దేశంలో అతి పెద్ద పండగ సీజన్ దసరా, దీపావళి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీ తగ్గించింది కనుక ఏసీలు, కార్లు, బైకులు, బట్టలు అన్నీ కారుచవుకగా అమ్మేస్తున్నామని వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్ సంస్థలు ఒకటే ఊదర గొట్టేస్తున్నాయి.
కనుక ప్రజలు ఈసారి కాస్త గట్టిగానే పండగ చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఏది నిజమైనదో… ఏడి నకిలీదో కూడా తెలీదు.
ఇక పండగ ఆఫర్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల సలహాలు, స్నేహితులు బంధుమిత్రుల ఆహ్వానాలు, అభినందనలు, ఫోటోలు, వీడియో లింకుల మాటున మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేసే ప్రమాదకరమైన మాల్‌వేర్ ఏముందో ఎవరూ ఊహించలేరు.
ఏఐ వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని ఫీచర్స్‌తో అనేక మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఒక్క బటన్ నొక్కితే చాలు… వాటితో పాటు ప్రమాదకరమైన మాల్‌వేర్ కూడా ఫోన్‌లోకి ప్రవేశించి మన కాంటాక్ట్స్, ఆధార్, పాన్, క్రెడిట్ కార్డ్ తో సహా మొత్తం అన్ని వివరాలు హ్యాకర్స్ కు చేరిపోతాయి.
ముఖ్యంగా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే తొందరలో చాలా మంది ముందూ వెనుకా చూడకుండా వాటికి అన్ని రకాల అనుమతులు ఇచ్చేస్తుంటారు. ఇదే ఎక్కువమంది కొంప ముంచుతోంది.
ఎవరో అపరిచుతుడి నుంచి ఫోన్ వచ్చినా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది. కొన్ని నిమిషాలు మాట్లాడితేనే ఫోన్ హ్యాక్ అయిపోయే సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది.
బజారులో దుకాణాల వద్ద, ఆన్‌లైన్ సంస్థల క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. పార్సిల్ వచ్చింది డెలివరీ బాయ్‌కి మీ వివరాలు చెప్పాలని అడిగినా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
జెమినీ బనానా యాప్ ద్వారా మామూలు ఫోటోలను 3డీ ఫోటోలుగా మార్చుకునే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న మహబూబ్ నగర్‌లోని ఓ వ్యక్తి ఖాతాలో నుంచి రూ.70,000 మాయమైపోయాయి. విజయనగరంలో ఓ టీచర్ పొరపాటున ఓ లింక్ క్లిక్ చేయడంతో రూ.5 లక్షలు పోగొట్టుకున్నారు.
ఇంట్లో చిన్నపిల్లలు మారం చేస్తుంటే తల్లితండ్రులు ఏమాత్రం సంకోచించకుండా వారి చేతికి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తుంటారు. ఈ సైబర్ మోసాల పట్ల ఇంత అవగాహన ఉన్న పెద్దవాళ్ళు, చదువుకున్నవాళ్ళే పొరపాటున లింక్స్ క్లిక్స్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నప్పుడు, చిన్నారులకు, తెలిసీ తెలియని వయసు పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇస్తే ఇంకెంత ప్రమాదమో ఆలోచిస్తే మంచిది.
అసలు ఈరోజుల్లో సైబర్ నేరాలు ఈవిదంగా జరుగుతాయని, ఇన్ని రకాలుగా జరుగుతున్నాయని ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొని ఉందంటే, మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు. ఈ 9 నెలల్లోనే భారత్‌లో లక్షలమంది లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. కనుక ఈ పండగ సీజన్లో అందరూ మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది.




