చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన సమయంలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, మెగాస్టార్ చెంత చేరిన విషయం తెలిసిందే. రాజకీయంగానే కాక, ఫ్యామిలీ పరంగానూ మిక్కిలి సన్నిహితులైన గంటా – చిరంజీవి ద్వయం కాలక్రమేణా ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ‘ప్రజారాజ్యం’ను వీడి మరలా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ అనుభవాన్నంతా తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు గంటా.
‘ప్రజారాజ్యం’ పార్టీని వీడుతున్నానని చెప్పే సమయంలో తన కన్నీరు ఆగలేదని, చిరంజీవి గారు కూడా కన్నీటిపర్యంతమయ్యారని, అయితే నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలంటూ ఆకాంక్షించారని, అలాగే తెలుగుదేశం పార్టీలోకి చేరాలని అనుకుంటున్నట్లుగా తన నిర్ణయాన్ని చెప్పిన సమయంలో… వైసీపీలోకి వెళ్ళడం లేదు కదా… అదే నాకు సంతోషం అన్నారని, తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో నన్ను కూడా ఒక తమ్ముడిగా చిరు చూసారని మెగాస్టార్ తో ఉన్న అనుభూతులను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు గంటా.
ఇక, వర్తమాన రాజకీయాలపై కూడా ప్రస్తావించిన గంటా… జగన్ ప్రతిపక్ష నేతగా ఉంటే 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం విజయం మరింత తేలిక అవుతుందని, అలాగే ప్రస్తుతం రాజకీయాన్ని కుదిపేస్తున్న ప్రత్యేక హోదా అంశం నుండి టిడిపి బయట పడుతుందని, స్పెషల్ స్టేటస్ అంశం బిజెపికే పార్టీకే ఎక్కువ నష్టం చేకూరుస్తుందని, అలాగే బిజెపిని నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ కు కూడా భంగపాటు తప్పదన్న కీలక వ్యాఖ్యలు చేసారు గంటా శ్రీనివాసరావు.



