గడిచిన రెండు రోజులుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కేబినేట్ మీటింగ్ కు డుమ్మా కొట్టిన గంటా, త్వరలోనే పార్టీ మారతారన్న సంకేతాలను ఇచ్చారు. వైసీపీలోకి వెళ్లనున్నారని బలంగా ప్రచారం జరుగుతున్నా, జనసేనలోకి కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్నది కీలక సమాచారం. గతంలో చిరంజీవి ప్రజారాజ్యంలోకి జంప్ చేసిన గంటా, అది కాస్త కాంగ్రెస్ విలీనం తర్వాత టిడిపిలోకి వచ్చేసారు.
గత ఏడాది కాలంగా పార్టీలో తనకు లభిస్తున్న విధానంతో కలత చెందిన గంటా, పార్టీ మార్పు అనివార్యం కానుందనేది అసలు టాక్. ఇది తేలడానికి ఎంతో సమయం లేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. టిడిపిలో కొనసాగే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా సిఎం పర్యటనకు హాజరవుతారు. లేని పక్షంలో మరో పార్టీ జెండా పట్టుకోవడానికి గంటా సిద్ధపడినట్లే భావించవచ్చు.
ఈ అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందట. కీలకమైన నేతలను రంగంలోకి దించి గంటాను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని, జగన్ పాదయాత్రలో గంటాకు చేరికను సిద్ధం చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. అంటే మరికొద్ది గంటల్లో గంటా ఎపిసోడ్ కు క్లైమాక్స్ పడనుందన్న మాట. ఈ క్లైమాక్స్ లో శుభంకార్డు తమ వైపుకే ఉండాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి.



