‘దంగల్’ సినిమాలో నటించిన 16 ఏళ్ల జైరా వసీంకు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని కలవడం పట్ల క్షమాపణలు చెప్పాలంటూ కశ్మీర్ యువత సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంపై గంభీర్ ఫైర్ అయ్యాడు. జైరాతో బలవంతంగా క్షమాపణలు చెప్పించాలనుకోవడం అత్యంత అవమానకరమని, ఇది పూర్తిగా లింగవివక్షతో కూడుకున్నదని విమర్శించాడు.
‘దంగల్’ సినిమాలో నటించడం లేదా మహబూబా ముఫ్తీతో కలవడం ఇస్లాంకు విరుద్ధమని చెప్పడం దారుణమని… ఇది సిగ్గుచేటు చర్య అని, జైరాను అడిగినట్టే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను అడగగలరా అంటూ సవాల్ విసిరాడు. కేవలం అభద్రతా భావంతోనే జైరాపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఒక బాలిక ఎదగడం చూసి ఓర్వలేకే ఈ విమర్శలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
గత 6 నెలలుగా కశ్మీర్ యువత చాలా దాడులను ఎదుర్కొంటున్నారని… ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిని ఎలా కలుస్తావంటూ జైరాపై సోషల్ మీడియాలో అక్కడి యువత నానా యాగీ చేసింది. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే జైరాను విమర్శిస్తున్న వారిపై గంభీర్ మండిపడ్డాడు. మరోవైపు, జైరాకు రెజ్లర్లు గీతా ఫొగాట్, బబిత ఫొగాట్ లు కూడా అండగా నిలిచి, అండగా తాముంటామంటూ భరోసా ఇచ్చారు.



