గూగుల్ కంపెనీ రూ.87,000 కోట్లు పెట్టుబడితో విశాఖలో 1 గిగావాట్ సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఏపీకి వస్తుండటం చాలా శుభ పరిణామమే. కానీ దీనిపై కూడా వైసీపీ సన్నాయి నొక్కులు మొదలైపోయాయి.
ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన ఐటి, పరిశ్రమల శాఖల మంత్రిగా ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడని మాజీ గుడ్డు మంత్రి, ఇప్పుడు ఆ శాఖలకు సంబందించి ఇటువంటి అంశాలపై మాట్లాడాల్సిన బాధ్యత తనదే అన్నట్లు మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
రాష్ట్రానికి ఇంత పెద్ద ఐటి కంపెనీ, ఇంత భారీ పెట్టుబడి వస్తుంటే ఎవరైనా సంతోషిస్తారు… స్వాగతిస్తారు తప్ప కోడిగుడ్డుకి ఈకలు పికాలనుకోరు.
కానీ ప్రతిపక్షమన్నాక ప్రభుత్వం చేసే ఏ పనినైనా విమర్శించాల్సిందే అనే ఫార్ములా ప్రకారం, గూగుల్ విషయంలో కోడిగుడ్డుకి ఈకలు పీకేస్తోంది వైసీపీ. సరే! అది ప్రతిపక్షం… కనుక అర్ధం చేసుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రం కర్ణాటక కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కర్ణాటక ఐటి మంత్రి ప్రియంక్ ఖర్గే బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.22 వేలకోట్లు పైగా రాయితీలు ఇచ్చి గూగుల్ కంపెనీని తెచ్చుకుంటోంది. ఇలా చేస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి కాదు దివాళా తీస్తుంది. అదే… మేము చేస్తే వెంటనే విమర్శలు మొదలైపోతాయి. అభివృద్ధికి ఐటి కంపెనీలు అవసరమే కానీ ఇంతగా రాయితీలు ఇచ్చి తెచ్చుకున్నా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు,” అని అన్నారు.
ఇదివరకు టీసీఎస్, ఎల్&టి కంపెనీ తదితర ఐటి కంపెనీలకు ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇచ్చినప్పుడూ ఇలాంటి సన్నాయి నొక్కులే వినిపించాయి.
కానీ జగన్ హయంలో లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలు చేయడం తప్పుగా అనుకోలేదు. వాటి కంటే, రాష్ట్రానికి భారీగా ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం, అభివృద్ధి కల్పించే ఇటువంటి కంపెనీలకు రాయితీలు ఇవ్వడమే మేలు కదా? ఈ రాయితీలను పెట్టుబడులుగా భావిస్తే రాయితీలు ఇవ్వడం తప్పనే ఆలోచనే తప్పని అర్ధమవుతుంది.
హైదరాబాద్‌కు వచ్చిన ఇటువంటి ప్రఖ్యాత ఐటి కంపెనీల వల్లనే కదా అంత అభివృద్ధి, అన్ని ఉద్యోగాలు, అంత ఆదాయం సమకూరుతోంది. ఆరోజు చంద్రబాబు నాయుడు వాటికి రాయితీలు ఇవ్వడం వేస్ట్ అనుకొని ఉంటే నేడు హైదరాబాద్ ఇలా ఉండేదా?
ఇక కర్ణాటక ఐటి మంత్రి ప్రియాంక్ ఖర్గే బాధ… గూగుల్ కంపెనీ కర్ణాటకను కాదనుకొని ఏపీలో అన్ని వేలకోట్లతో ఏర్పటవుతోందనా లేదా బెంగళూరుకి పోటీగా విశాఖ మారుతుందనే భయమా లేదా బెంగళూరులోని ఐటి కంపెనీలను ఏపీకి రావాలని నారా లోకేష్ ఆహ్వానిస్తున్నందునా దానికి ఇది కౌంటరా? అంటే అన్నీను అనుకోవలసి ఉంటుంది. వైసీపీ, కర్ణాటక సన్నాయి నొక్కులయ్యాయి. ఇక కేటీఆర్ కూడా నొక్కేస్తే ఓ పనైపోతుంది.







