2014లో విడుదలైన “లౌక్యం” సినిమా ద్వారా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న హీరో గోపీచంద్, ఆ తర్వాత సక్సెస్ అన్న పదానికి దూరమయ్యారు. రావడానికి ప్రతి ఏడాది రెండు సినిమాలు వచ్చాయి గానీ, అవేమీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. “జిల్” ఏదో పరవాలేదనిపించగా, ‘సౌఖ్యం’ మరీ ‘లౌక్యం’లా ఉందని తేల్చేసారు. ఇక గతేడాది వచ్చిన ‘గౌతమ్ నంద, ఆక్సిజన్’ చిత్రాల పరిస్థితి తెలియనిది కాదు. విడుదలకు సిద్ధమైన “ఆరడుగుల బుల్లెట్” అసలు వచ్చిందో లేదో కూడా తెలియని పరిస్థితి. దీంతో మాంచి కమర్షియల్ హిట్ కోసం గోపీచంద్ నిరీక్షిస్తున్నారు.
ప్రస్తుతం చక్రి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు గోపీచంద్. కెరీర్ లో 25వ సినిమాగా కూడా ప్రాధాన్యతను దక్కించుకున్న ఈ సినిమా టైటిల్ ను “పంతం”గా పరిశీలించారు. అయితే ఈ టైటిల్ మరీ డబ్బింగ్ సినిమా టైటిల్ మాదిరి ఉందన్న నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో, మార్పు అనివార్యం అయ్యిందని తెలుస్తోంది. కానీ గోపీచంద్ సెంటిమెంట్ ను పక్కన పెట్టకుండా, చివర్లో ‘౦’ వచ్చే విధంగానే ‘శపథం’ అన్న టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అయినా గోపీచంద్ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిద్దాం.



