వైసీపీ నేత, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖారారైంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో భారీ అనుచరగణంతో బుధవారం మధ్యాహ్నం విజయవాడలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తన మద్దతుదారులు, అనుచరులతో సంతమాగులూరులో సుదీర్ఘ చర్చలు జరిపిన మీదట గొట్టిపాటి పార్టీ మారేందుకే నిర్ణయించుకోగా, తెలుగుదేశం పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు సుముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అయినట్లే.
ఇదిలా ఉంటే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జిల్లా సమన్వయకర్తగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రకటించిన వేమిరెడ్డి, జగన్ వైఖరిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీలో చేరి తాను తప్పు చేశానని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు పోలికే లేదన్నారు. ‘వైఎస్ ఓకే… జగన్ నాట్ ఓకే’ అంటూ పేర్కొన్న వేమిరెడ్డి… ఆ పార్టీలో తాను ఎందుకు చేరానా? అని బాధపడుతున్నానని కూడా వ్యాఖ్యానించారు.



