ఈ ఉదయం ‘చలోరె చల్’ పేరిట యాత్రను చేపట్టి, కొండగట్టుకు బయలుదేరడానికి ముందు పవన్ కల్యాణ్, ‘జనసేన’ సోషల్ మీడియాకు సంబంధించి ‘వీరమహిళ’ పేరుతో ఏర్పాటయిన విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆపై ఆయన మాట్లాడుతూ “వీరమహిళ’ బృందానికి శుభాభినందనలు తెలుపుతూ జనసేన సోషల్ మీడియా బృందంలో క్రియాశీలక సభ్యులుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన అందరికీ స్వాగతం పలికారు.
జనసేన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకు వెళుతూ, ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకు వచ్చే విధంగా మీరు కృషి చేస్తారన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ప్రజా శ్రేయస్సుకు మనం అవిరళ కృషి జరుపుదాం. దేశాభివృద్ధిలో మన వంతు పాత్ర పోషిద్దాం” అన్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొండగట్టుకు బయలుదేరిన వేళ, ఆయన భార్య అన్నా లెజినోవా స్వయంగా హారతిచ్చి, వీడ్కోలు పలికిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
లైట్ మెరూన్ రంగు చీరలో మెరిసిపోతున్న అన్నా, పవన్ కు ఎదురు వచ్చి తిలకం దిద్దుతున్న వేళ, ఆమెకు తిలకం ఎలా పెట్టాలో తెలియలేదు. ఆమె చూపుడు వేలితో కుంకుమను చేతికి తీసుకోబోగా, స్పందించిన పవన్, ఆ వేలితో కాదని, కుడి చేయి ఉంగరపు వేలితో ఇలా కుంకుమ దిద్దాలని చూపించారు. ఆపై అన్నా ఆయనకు అలానే కుంకుమ దిద్దగా, ఈ ఘటన మొత్తం మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అవుతోంది.
అలాగే తన భార్య అన్నా లెజినోవా చేసిన పని జనసేనానికి నవ్వు తెప్పించింది. హిందూ సంప్రదాయాల గురించి పెద్దగా అనుభవం లేని అన్నా, యాత్రకు బయలుదేరే ముందు పవన్ బయలుదేరే ఫోర్డ్ కారు ‘ఏపీ 07 డీకే 2324’కు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయను కారు చుట్టూ ఎలా తిప్పాలి? ఎలా కొట్టాలన్న విషయమై పవన్ సైగలు చేస్తూ, చెబుతుండగా, అన్నా దాన్ని ఫాలో అయిపోయారు. కొబ్బరికాయను ఆమె కారు చుట్టూ తిప్పుతుంటే పవన్, ముసిముసి నవ్వులతో నిలబడ్డారు.
ఆపై కాయను నేలకేసి కొట్టగా, అది పగల్లేదు. దీంతో ఆమె తన నోటికి చెయ్యి అడ్డుపెట్టుకోగా, బిగ్గరగా నవ్విన పవన్, మరోసారి ట్రై చేయాలని సూచించారు. దీంతో ఈ దఫా కొబ్బరికాయను ఆమె మరింత గట్టిగా నేలకేసి కొట్టడంతో అది పగిలింది. అంతే, అక్కడున్న జనసేన అభిమానులు, కార్యకర్తలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ఈ మొత్తం ఘటనా కూడా మీడియా కెమెరాలకు చిక్కి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అనంతరం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయం నుంచి కొండగట్టు అంజన్న దర్శనం నిమిత్తం పవన్ కల్యాణ్ బయలుదేరిన వేళ, భారీ సంఖ్యలో పవన్ అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట తరలి వెళుతున్నారు. పవన్ కాన్వాయ్ ప్రారంభంలో సుమారు 40 కార్లలో అభిమానులు ఆయన వెంట పయనం కాగా, హైదరాబాద్ శివార్లకు చేరేసరికి, మరో 100కు పైగా వాహనాలు కాన్వాయ్ లోకి వచ్చి చేరాయి.
వివిధ ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, పవన్ కాన్వాయ్ లో కలవడంతో, సుమారు 150 వాహనాల భారీ కాన్వాయ్, ఇప్పుడు కరీంనగర్ జాతీయ రహదారిపై పరుగులు తీస్తున్నాయి. దారి మధ్యలో అభిమానులు పెద్ద సంఖ్యలో కనిపించిన చోటెల్లా, కారును ఆపి వారిని పలకరిస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. కాన్వాయ్ నిదానంగా సాగుతుండడంతో మధ్యాహ్నం 3 గంటల తరువాతే కొండగట్టుకు చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Tollywood's Powerstar #PawanKalyan greeting fans who gathered at #Karimnagar . He will visiting temples following which he will embark on his #Telangana tour – #Jagityala #Kothagudam #Khammam #JanasenaParty #ChaloreChaloreChal pic.twitter.com/LGPnYrBbmb
— PAUL OOMMEN (@Paul_Oommen) January 22, 2018



