డాలర్ డ్రీమ్స్… ఆ పీడకలలు మనకొద్దు!

h1b_visa_indians

అమెరికా వెళ్ళాలి… అక్కడే స్థిరపడాలి… డాలర్లలో సంపాదిస్తూ దర్జాగా బ్రతకాలనే లక్షలాది భారతీయుల కలలు ఒక్కో సంతకంతో ట్రంప్ చెరిపేస్తున్నారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెరిగింది. ఇప్పుడు హెచ్-1బీ వీసా లాటరీ సిస్టమ్‌లో కూడా భారీ వడపోత మొదలవుతోంది.

ఏడాదికి 1,62,528 డాలర్ల కంటే ఎక్కువ జీతాలు పొందే అత్యంత నైపుణ్యం ఉన్నవారికి నాలుగుసార్లు లాటరీ ఛాన్స్ ఇస్తారు. మిగతావారికి మాత్రం ఒక్కసారే. అంటే సాధారణ మధ్యతరగతి యువతకు అమెరికా తలుపులు దాదాపు మూసుకుపోయినట్టే.

ADVERTISEMENT

కనుక చాలా మంది యూరోప్ వైపు చూడవచ్చు. కానీ ఒకేసారి అందరూ అక్కడికి బయలుదేరితే రేపు అక్కడా ఇదే పరిస్థితి ఎదురవక మానదు. గల్ఫ్ దేశాలు ఇప్పటికే తమ పౌరులకు ఉద్యోగాలలో నియమించుకుంటూ లక్షలాది భారతీయులను వెనక్కి పంపిస్తున్నాయి.

రేపు యూరప్ దేశాలు కూడా ఇదే చేస్తే ఆశ్చర్యం లేదు. అప్పుడు అన్ని దేశాల నుంచి భారతీయులు వెనక్కి తిరిగివస్తే వారందరితో యువత పోటీ పడాల్సి ఉంటుంది. కనుక యువత అమెరికా పగటి కలలు కంటూ అమూల్యమైన సమయం వృథా చేసుకోకుండా, భారత్‌లోనే అవకాశాలు వెతుక్కోవడం, సృష్టించుకోవడం చాలా మంచిది.

ఇప్పుడు అనేక విదేశీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు భారత్‌కు తరలి వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.

అలాగే భారత్‌లో మౌలిక వసతులు, వైద్య, ఏరో స్పేస్, రక్షణ, సినీ, డిజిటల్ మీడియా తదితర రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవన్నీ భారతీయ యువతకు తలుపులు తెరిచి కొత్త అవకాశాలు చూపిస్తున్నాయి.

కనుక వీసా లాటరీలో అదృష్టం పరీక్షించుకోవడం దాని కోసం ఎదురుచూపులు చూస్తుండటం కంటే మనమే కొత్త మార్గాలు సృష్టించుకోవడం తెలివైన పని.

ADVERTISEMENT
Latest Stories