జనసేనని ఓడించేందుకు వైసీపి అక్కరలేదు.. జోగయ్య ఒక్కరు చాలు!

Chegondi Harirama Jogaiah

టిడిపి, జనసేనల పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు తీసుకోవడంపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌కు ఓ లేఖ వ్రాశారు.

రాష్ట్రంలో జనసేన అంత బలహీనంగా ఉందా లేక ఉందని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తున్నారా?అని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ తనను తాను, తన పార్టీ శక్తిని చాలా తక్కువగా అంచనా వేసుకోవడం వలననే ఇంత తక్కువ సీట్లకు అంగీకరించారని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

అయినా ఒకరు మనకి ఇవ్వడం ఏమిటి? మనం ఇంకొకరిని దేహీ అంటూ సీట్లు అడిగి తీసుకోవడం ఏమిటి?అని ప్రశ్నించారు. ఈ సీట్ల కేటాయింపుతో జనసైనికులను కూడా తృప్తి పరచలేకపోతే ఇక ఎన్నికలలో ఏవిదంగా గెలువగలమని హరిరామ జోగయ్య ప్రశ్నించారు.

పవన్‌ కళ్యాణ్‌ని కనీసం రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలని, టిడిపి, జనసేనల సంకీర్ణ ప్రభుత్వంలో కాపులు రాజ్యాధికారం కోరుకుంటున్నారని పవన్‌ కళ్యాణ్‌‌ గుర్తించాలని హరిరామ జోగయ్య లేఖలో వ్రాశారు.

ఇన్ని దశాబ్ధాలుగా రాజకీయాలలో అనుభవం కలిగి, ముఖ్యంగా కాపు సామాజికవర్గం బలాలుబలహీనతలు క్షుణ్ణంగా తెలిసి ఉన్న హరిరామ జోగయ్య వంటి సీనియర్ నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ఇటువంటి లేఖలు వ్రాస్తుండటం చాలా ఆశ్చర్యం, ఆక్షేపనీయమే.

రాష్ట్రంలో వైసీపి దౌర్జన్య రాజకీయాలను, గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న బీజేపీ అధిష్టానం వైఖరిని చూస్తున్నవారు ఎవరూ జనసేనకు ఇటువంటి సలహాలు ఇవ్వరు.

ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, జగన్మోహన్‌ రెడ్డి, వైఎస్ షర్మిలలాగ పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించి, చురుకుగా పాల్గొని ఉంటే గత ఎన్నికలలోనే ఆ కల నెరవేర్చుకునే అవకాశం ఉండేది కదా?

జనసేన బలం ఏపాటిదో, అభిమానుల చప్పట్లకు ఓట్లు రాలవని ఆయన అప్పుడే గ్రహించారు. అందుకే ఒంటరిగా పోటీ చేయడమంటే ‘వీరమరణమే’ అని గుర్తించి సుదీర్గ రాజకీయ, పరిపాలన అనుభవం కలిగిన టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. రెండుమూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు వాటిలో పెద్ద పార్టీకి ఎక్కువ సీట్లు లభించడం సహజం. కనుక సీట్ల సర్దుబాట్లు అనివార్యం. కానీ దానినీ హరిరామ జోగయ్య తప్పు పట్టడం విస్మయం కలిగిస్తుంది.

రాష్ట్రంలోని వాస్తవ రాజకీయ పరిస్థితులు, కుల సమీకరణలు, జనసేన బలాబలాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని 24 సీట్లకు అంగీకరించారని అర్దమవుతూనే ఉంది. కానీ హరిరామ జోగయ్య వంటి శ్రేయోభిలాషులు పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయాలను తప్పు పడుతూ, ఎలా గెలుస్తారు? అంటూనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపడితే చూడాలని కోరుకుంటున్నామని లేఖలు వ్రాయడాన్ని ఏవిదంగా చూడాలి?

ఇటువంటి చర్యలే టిడిపి, జనసేనల పొత్తులను, వాటి విజయావకాశాలను కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉంటుంది. జనసేన గెలవాలని, పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవ్వాలని మనస్పూర్తిగా కోరుకునేవారు తమ శక్తి సామర్ధ్యాలు, పలుకుబడితో గెలిపించుకొనేందుకు ప్రయత్నించాలి కానీ ఈవిదంగా ఎన్నికలకు ముందే పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం శల్యసారధ్యం చేయడమే అవుతుంది కదా?

ఒకవేళ ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేయబోతున్న 24 సీట్లలో ఒక్కటి గెలుచుకోలేకపోయినా అందుకు జనసేన, దాని అధినేత పవన్‌ కళ్యాణే పూర్తి బాధ్యత వహిస్తారు. కానీ ఆ ఓటమికి హరిరామ జోగయ్య వంటివారికి ఎటువంటి సంబందమూ ఉండదు. నష్టమూ కలుగదు. దానికి వారు బాధ్యత వహించరు కదా?

హరిరామ జోగయ్య వంటి వారి తీరు చూస్తే, జనసేనని ఓడించేందుకు వైసీపి అవసరం లేదు ఆయనే ఓడించి వైసీపిని గెలిపిస్తారేమో అనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories