అగ్ర హీరోల సినిమాలకు వారే బ్రాండ్ అంబాసిడర్లు. అన్నీ తామై ప్రేక్షకులను ధియేటర్ల వద్దకు పరుగులు పెట్టిస్తారు. అయితే మే మాసంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “బ్రహ్మోత్సవం” సినిమాలో హీరో ప్రిన్స్ మహేష్ బాబు కాకుండా మరో అంశం హైలైట్ అవుతోంది. అదే ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన పివిపి. ఇటీవల కాలంలో మంచి ‘కాన్సెప్ట్’లతో సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తోంది.
‘సైజ్ జీరో’ సినిమాతో మొదలైన ప్రస్థానం “క్షణం, ఊపిరి” సినిమాలతో పతాక స్థాయికి చేరింది. కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే వినూత్నమైన కధలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి… కధాబలం ఉన్న సినిమాలను నిర్మించే బ్యానర్ గా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో “బ్రహ్మోత్సవం” సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
‘క్షణం, ఊపిరి’ మాదిరిగానే విలువలతో కూడిన సినిమాగా ‘బ్రహ్మోత్సవం’ నిలుస్తుందని ప్రిన్స్ అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొట్టడంతో… ‘బ్రహ్మోత్సవం’ ఫలితం ఏమవుతుందా… అని ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళనగా ఉన్నారు. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు తోడు, చిత్ర నిర్మాణ సంస్థ అయిన పివిపి కూడా ‘బ్రహ్మోత్సవం’ విజయంపై విశ్వాసాన్ని పెంచుతోంది.



