అవును, గత కొంతకాలంగా తెలంగాణ కేసీఆర్ లేని రాజకీయాన్ని చూస్తుంది. బిఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటేందుకు ఇష్టపడం లేదు. పదేళ్ల అధికారం చేజారిపోవడంతో పాటుగా తానూ రాజకీయంగా దెబ్బకొట్టాలని చూసిన రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం కేసీఆర్ ను మరింత కుంగుదీసింది అనే ప్రచారం తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా నడిచింది.
అయితే కేసీఆర్ లేని రాజకీయంతో తెలంగాణ రాజకీయంలో ఏమైనా వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయా అంటే తెలంగాణ రాజకీయాలలో కాదు కానీ బిఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆ మార్పులు స్పష్టంగా దర్శనమిస్తున్నాయని చెప్పాలి.
కేసీఆర్ కనిపించని బిఆర్ఎస్ లో… పార్టీ క్యాడర్ నిశ్శబ్దంలోకి వెళ్లగా, కేసీఆర్ కుమార్తె కవిత పార్టీ నుండి బయటకెళ్లారు. ఇక పార్టీలో కేసీఆర్ తరువాత స్థానం ఎవరన్న చర్చ కేటీఆర్ – హరీష్ ల మధ్య రాజకీయ చిచ్చుకి తెరలేపనుంది అనే ప్రచారం జరుగుతుంది.
అలాగే కేసీఆర్ కనిపించని బిఆర్ఎస్…బీజేపీ లో విలీనానికి సిద్దమవుతుంది అనే ప్రచారాన్ని మోస్తుంది, ఇక కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందానికి అంగీకరించింది అనే వార్తలను ప్రచారంలోకి తెచ్చింది.
ఇక కేసీఆర్ జాడ లేని బిఆర్ఎస్…పార్టీలోని ముఖ్య నాయకులను పోగొట్టుకుంది, అలాగే ఇతర ముఖ్య నేతల పై అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. అలాగే ఏకంగా పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ కవిత నోటే బిఆర్ఎస్ ఉనికి పై ఆరోపణలు చేసేలా చేసింది.
అయితే కేసీఆర్ లేని బిఆర్ఎస్ చుట్టూ ఇంత రాజకీయ రచ్చ జరుగుతున్నప్పటికీ, కేసీఆర్ కనిపించని తెలంగాణ రాజకీయాలలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేసీఆర్ కనిపించని లోటు బిఆర్ఎస్ లో కనిపిస్తుంది కానీ తెలంగాణ రాజకీయాలలో కనిపించడం లేదు.
కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకున్నా ఆ లోటుని తన దూకుడుతో హరీష్ పూరిస్తున్నారు, కేసీఆర్ ప్రత్యర్థి పార్టీ పై రాజకీయ విమర్శలు చేసేందుకు ముందుకు రాకున్నా ఆ బాధ్యతను కేటీఆర్ నెరవేరుస్తున్నారు.
కాంగ్రెస్ – బిఆర్ఎస్ – బీజేపీ ల మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో కేసీఆర్ ప్రస్తావన కానీ కేసీఆర్ లోటు కానీ మచ్చుకైనా కానరావడం లేదు. కాకపోతే కాళేశ్వరం అంశంలో మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ లతో పాటు బిఆర్ఎస్ కూడా కేసీఆర్ ప్రస్తావన తీసుకొస్తున్న మాట వాస్తవం.
అయితే ఇందులో ఒకరు కేసీఆర్ ను దోషిగా చూపిస్తే, మరొకరు కేసీఆర్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి తాటాకు చప్పుళ్లు కేసీఆర్ ని బెదిరించలేవు, భయపెట్టలేవు అంటూ బిఆర్ఎస్ కేసీఆర్ నిర్దోషి అంటూ వాదిస్తుంది.
అయితే కేసీఆర్ లేని తెలంగాణ రాజకీయాలను ఊహించలేము, కేసీఆర్ కనిపించని రాజకీయాన్ని తెలంగాణ సమాజం స్వాగతించలేదు అంటూ గతంలో బిఆర్ఎస్ చెప్పిన మాటలు కేవలం మాటలకే పరిమితం అని అవి చేతలలో ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు అనేది నేటి తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే యిట్టె అర్ధమవుతుందేమో బహుశా..!






