జనసేనాని పవన్ కళ్యాణ్ దాదాపు రెండు వారాలుగా ఉభయగోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేస్తున్నారు. ఇదివరకెన్నడూ ఇన్ని రోజులు ఆయన ప్రజల మద్య తిరగలేదు. ఇంతగా జనసేన విధానాలు, వైఖరి గురించి నొక్కి చెప్పలేదు. ఇంతగా వైసీపీని చీల్చిచెండాడలేదు. కానీ ఈసారి ప్రతీ అంశాన్ని నొక్కి చెపుతున్నారు. వైసీపీని చీల్చిచెడుగుడు ఆడేసుకొంటున్నారు.
ఈ కారణంగా గోదావరి జిల్లాల ప్రజలతో పవన్ కళ్యాణ్ బాగానే కనెక్ట్ అయ్యారనే చెప్పొచ్చు. ఈసారి పర్యటనలో పవన్ కళ్యాణ్ ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు.
* జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయి. పులివెందల ఫ్యాక్షనిస్టులు రాష్ట్రమంతటా వ్యాపిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. కనుక జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని చెపుతున్నారు.
* తాను వైసీపీని ఢీకొంటున్నందున తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తనను అంతం చేసేందుకు వైసీపీ సుపారీ గ్యాంగ్‌లను రంగంలో దించిందని కుండబద్దలు కొట్టారు. అయితే ఈ పోరాటంలో తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా వెనక్కు తగ్గేదెలేదని స్పష్టం చేస్తున్నారు.
* ఈసారి జనసేనకు ఒక్క అవకాశం ఇమ్మనమని, తాను ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని పవన్ కళ్యాణ్ విస్పష్టంగా చెపుతున్నారు.
* జనసేన అధికారంలోకి వస్తే ఉభయగోదావరి జిల్లాలను ఏవిదంగా అభివృద్ధి చేస్తామో, ఎటువంటి సంక్షేమ పధకాలు అమలుచేస్తామో చెపుతున్నారు.
* శాసనసభ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే ఉభయగోదావరి జిల్లాలలో ఈసారి వైసీపీకి ఒక్క సీటు కూడా ఈయవద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరి జిల్లాల ప్రజలే రాష్ట్ర భవిష్యత్ నిర్దేశించగలరని చెపుతున్నారు.
* ఈసారి కాపులు, బీసీలు తనకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే కోరుతున్నారు. కాపులు, బీసీలతో పాటు అన్ని కులాలను కలుపుకుపోతానని చెపుతున్నారు.
పవన్ కళ్యాణ్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్షేపిస్తున్నప్పటికీ, ఆయన గురిచూసి తమను కొడుతుండటంతో విలవిలలాడుతూ ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియకనే వారు ఆవిదంగా మాట్లాడుతున్నారని భావించవచ్చు. ముఖ్యంగా తనను హత్య చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందనే పవన్ చేసిన తీవ్ర ఆరోపణకు వైసీపీలో ఎవరూ సమాధానం చెప్పలేక తడబడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినవుతానని ఏదో మొక్కుబడిగా ఆ మాట చెప్పలేదు. గోదావరి జిల్లాలను పర్యాటక రంగంగా అభివృధ్ది చేస్తానని చెపుతున్నారు. ఎన్నికల హామీలు కూడా ప్రకటిస్తున్నారు. ఆయన మాటలను టిడిపి, బిజెపి నేతలెవరూ ఖండించక పోవడంతో వైసీపీలో అయోమయం ఏర్పడింది. ఇది ఖచ్చితంగా టిడిపి, జనసేన, బిజెపిల ఉమ్మడి వ్యూహమే అని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అయితే దీనిని ఏవిదంగా చేధించాలో తెలియక తలలు పట్టుకొంటున్నారు.
పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలలో ఈసారి ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకూడదనే మాట రెండు జిల్లాలలో బాగానే వ్యాపించిపోయింది. దీంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వారి విమర్శలతోనే స్పష్టమవుతోంది.
ఇంతకాలం చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడని విమర్శించిన వైసీపీ నేతలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఏవిదంగా ఎదుర్కోవాలో తెలీక తలలు పట్టుకోవడం ఆశ్చర్యమే కదా?



