రటాల శివ దర్శకత్వం వహిస్తున్న “భరత్ అనే నేను” షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. లక్డీకపూల్ లోని ‘అమరావతి’ ధియేటర్ లో స్వయంగా మహేష్ బాబు పాల్గొన్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మహేష్ బాబును చూడాలని కోరారు. ముఖ్యంగా ప్రిన్స్ పీఏను ఈ దిశగా విజ్ఞప్తి చేయగా, ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, ఇబ్బంది కలిగించవద్దని అభిమానులను కోరాడు.
అయితే కాస్త దూరంలో ఉన్న ప్రిన్స్ ను ఒక్కసారి చూడడానికి అనుమతి ఇవ్వని పీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అభిమానులు అక్కడే బైఠాయించారు. ఇదిలా ఓ పక్కన జరుగుతుండగానే మరో వైపు షూటింగ్ ముగించుకుని ప్రిన్స్ మరోదారిలో బయటకు వెళ్ళిపోయారు. దీంతో కట్టలు తెంచుకున్న వీరి ఆగ్రహ ఫలితం కారణంగా స్థానికంగా చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అత్యంత బిజీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు కూడా ఇబ్బందులకు గురయ్యారు.
పక్కనే కలెక్టర్ కార్యాలయం ఉండడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ను సర్దిచెప్పి పంపించడానికి సైఫాబాద్ పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. తమ అభిమాన హీరోను చూడాలనుకోవడం తప్పులేదు గానీ, అవతల చిత్ర యూనిట్ పరిస్థితిని కూడా అర్ధం చేసుకోవాలనేది పోలీసులు సర్దిచెప్పిన మాట. ఇలాంటి పరిణామాలతోనే సిటీలో షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న ధియేటర్ ప్రస్తుతం మూతపడి ఉండడంతో అనుమతులు లభించాయని తెలుస్తోంది.



