ఆడిన మూడు మ్యాచ్ లలోనూ విజయాలను సొంతం చేసుకుని మంచి ఊపు మీదున్న గుజరాత్ లయన్స్ జట్టుకు సన్ రైజర్స్ జట్టు గట్టి షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 135 పరుగులను మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రైనా ఒక్కడే 51 బంతుల్లో 75 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ అయిఆ సాధించగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఏకంగా 4 వికెట్లు తీసి సత్తా చాటడంతో లయన్స్ తలవంచక తప్పలేదు.
స్వల్ప లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఎలాంటి ‘ట్విస్ట్’లకు తావు లేకుండా కనీసం ఒక్క వికెట్ కూడా పడకుండానే ఓపెనర్లు సత్తా చాటారు. ఈ సీజన్లో మంచి ఫాంలో ఉన్న రైజర్స్ కెప్టెన్ వార్నర్ 48 బంతుల్లో 74 పరుగులతో అదరగొట్టగా, శిఖర్ ధావన్ 41 బంతుల్లో 53 పరుగులు చేసి ఫాంలోకి వచ్చాడు. వీరిద్దరి బ్యాటింగ్ ప్రతిభతో కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. దీంతో రన్ రేట్ కూడా మెరుగుపడి ‘మైనస్’ నుండి ‘ప్లస్’కు మారింది.
ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ వార్నర్ అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో నిలిచి ‘ఆరంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. వరుసగా రెండు విజయాలతో మళ్ళీ సన్ రైజర్స్ జట్టుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరో విశేషమేమిటంటే… బౌలర్ల జాబితాలోనూ 7 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ ‘పర్పల్ క్యాప్’ను వశం చేసుకున్నాడు.



