రాజకీయాలలో గెలుపోటములు సర్వ సహజం. అయితే నేటి రాజకీయ వాతావరణం లో రాజకీయ నాయకులు కేవలం గెలుపు ని మాత్రమే ఆస్వాధిస్తున్నారు కానీ ఓటమిని స్వీకరించలేకపోతున్నారు. మొన్న బిఆర్ఎస్ ఓటమితో కేసీఆర్, నిన్న వైసీపీ ఘోర పరాజయంతో జగన్, నేడు డీఎంకే పతనంతో స్టాలిన్ ప్రజా తీర్పును కూడా గౌరవించలేకపోతున్నారు.
తెలంగాణలో పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కగానే రేవంత్ సర్కార్ ఆరు నెలల్లో కూలిపోతుందని, ఆ తరువాత అధికారం మనదే అంటూ గులాబీ క్యాడర్ ని మభ్యపెట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజా తీర్పును గౌరవించకుండా కనీసం పదినెలలు కూడా ప్రతిపక్షంలో ఉండలేక ఇలా ప్రభుత్వాలు కూలిపోతాయంటూ ప్రకటించడం, కూలిపోవాలని ఆశించడం ఎంత వరకు సమంజసం.?
ఇక ఏపీలో వై నాట్ 175 అన్న జగన్ నినాదం 151 తో అధికారంలో ఉన్న వైసీపీ ని 11 తో పాతాళానికి తెచ్చింది. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపుని ప్రజాస్వామ్య విజయంగా, ప్రజా గెలుపుగా, పేదల విజయంగా అభివర్ణించిన జగన్ 2024 వైసీపీ ఓటమిని ఇప్పటికి ఒప్పుకోలేకపోతున్నారు.
ఈవీఎంల ట్యాపరింగ్ అంటూ కూటమి ఘనవిజయాన్ని తగ్గించేందుకు వైసీపీ ఘోర ఓటమిని కప్పిపుచ్చేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. తమ పార్టీ గెలుపుతో ప్రజాస్వామ్యం గెలిచినప్పుడు వైసీపీ ఓటమితో ప్రజాస్వామ్యం ఓడిపోతుందా.? వైసీపీ చేస్తున్న ఈ చౌకబారు ప్రకటనలు ప్రజా తీర్పును అగౌరవపరచడం కాదా.?
తాజాగా విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా సంచలంగా మారాయి. దశాబ్దాల ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి పార్టీ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లలోనే తన పార్టీని అధికారంలోకి తెచ్చిన విజయ్ దేశంలోనే హాట్ టాపిక్ అయ్యారు.
రాజకీయాలలో ప్రజామోదం లభిస్తే ఒక టీచర్ నుంచి ఆటోడ్రైవర్ వరకు ఎవరైనా ఎమ్మెల్యే అవ్వొచ్చని, ప్రజల నమ్మకాన్ని సంపాదిస్తే తొలి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని అందుకోవచ్చని మరోసారి నిరూపించారు సినీ నటుడు విజయ్.
అయితే టీవీకే గెలుపు కొత్త తరం రాజకీయానికి ఒక దీక్షుచిలా నిలబడిన తరుణంలో ఇప్పుడు ఆ టీవీ ప్రభుత్వం కూల్చివేతకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయంటూ వార్తలు రావడం నిజంగా ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే అవుతుంది.
విజయ్ టీవీకే పార్టీకి సంబంధించిన 15 మంది ఎమ్మెల్యే లతో డీఎంకే పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారని, ఒక్కో ఎమ్మెల్యే కి 10 నుంచి 50 కోట్ల వరకు పెద్ద మొత్తంలో నగదు ఆఫర్ చేసి వారిని రాజీనామా చేయించడం ద్వారా టీవీకే ప్రభుత్వాన్ని కూల్చివేయాలని తెరవెనుక కుట్రలు జరుగుతున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరోపించారు.
అయితే ఈ కుట్ర వెనుక డీఎంకే నేత సెంథిల్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో డీఎంకే అధినేత స్టాలిన్ సైతం విజయ్ టీవీకే అధికారంలో ఎంతో కాలం కొనసాగలేదని, టీవీకే ప్రభుత్వం కూలిపోవడానికి ఆరు నెలల సమయం చాలంటూ వ్యాఖ్యానించారు.
దీనితో డీఎంకే పార్టీ నేతల పై వస్తున్న ఆరోపణల పై తమిళ రాజకీయాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. దశాబ్దాలపాటు అధికారం కోరుకునే రాజకీయ పార్టీలు ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే మాత్రం ఆరు నెలలో కూలిపోవాలని కోరుకోవడం, ఆ పార్టీల గెలుపుని తక్కువచేసేలా ఈవీఎంల ట్యాపరింగ్ అంటూ నిందలు వేయడం ప్రజాస్వామ్య విలువను దిగజార్చినట్టు కాదా.?




