మంత్రి పదవి సీదేసిందా అప్పలరాజుగారు… బాధపడకండి!

Sidiri Appala Rajuసీదిరి అప్పలరాజుగారు ఏ శాఖకు మంత్రిగారో రాష్ట్ర ప్రజలు తెలుసుకొనేలోగానే పాపం… ఆ పదవి ఊడిపోతోంది. మంత్రి సీదిరికి, స్పీకర్‌కు తమ్మినేని సీతారాంలను అర్జెంటుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని సీఎంవో నుంచి ఫోన్‌ రావడంతో ఇద్దరూ హడావుడిగా మధ్యాహ్నానికల్లా చేరుకొన్నారు. సిఎం జగన్‌ వారిద్దరితో సుమారు 40 నిమిషాల సేపు మాట్లాడారు.

తర్వాత మంత్రి సీదిరి బయట మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రిగారు నా స్థానంలో వేరే వారిని మంత్రిగా తీసుకొంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. బాధపడను కూడా. మంత్రిగా ఉన్నా లేకున్నా నేను మంత్రినే అని భావిస్తాను. నా దృష్టిలో వైసీపీలో ఎమ్మెల్యేలందరూ మంత్రులే. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే నాకు ముఖ్యం. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే నాకు ముఖ్యం.

ADVERTISEMENT

డా.అంబేడ్కర్ స్పూర్తితో రాష్ట్రంలో బడుగుబలహీనవర్గాలకు, మైనార్టీలకు ఆర్ధికంగా వెనుకబడినవారి అభ్యున్నతికి సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు. కనుక ఆయన మరో నాలుగైదుసార్లు ముఖ్యమంత్రిగా అయితేనే రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు లేని రాష్ట్రాన్ని సాధించగలుగుతాము. అప్పుడే రాష్ట్రంలో అన్ని వర్గాలవారికీ న్యాయం జరుగుతుంది. కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగారిని ఏవిదంగా ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేదే మాకు ముఖ్యం తప్ప ఈ మంత్రి పదవులు మాకు ముఖ్యం కావు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా నేను జగనన్నతోనే నడుస్తాను,” అని అన్నారు.

మంత్రి సీదిరి అప్పలరాజు పనితీరు బాగోలేదని ఇదివరకు సమావేశాలలోనే సిఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించి, పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించిన్నట్లు సమాచారం. కానీ ఆయన తమ అధినేత అంచనాలను అందుకోలేకపోయారని మంత్రి పదవి ఊడగొట్టడంతో స్పష్టమైంది. ఆయన స్థానంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాంను మంత్రిగా నియమించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవిలో నుంచి తొలగించిన్నట్లు ఇంకా అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. ఏప్రిల్ 3వ తేదీన సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈసారి మంత్రివర్గంలో నుంచి నలుగురు మంత్రులను తొలగించి వారి స్థానంలో వేరేవారిని నియమించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక మిగిలిన మూడు వికెట్లు ఏవో ఏప్రిల్ 3లోగానే ఈవిదంగానే తెలియవచ్చు.

టిడిపి ఒక్కో ఎమ్మెల్యేకి రూ.10 నుంచి 15 కోట్లు ముట్టజెప్పి గెలిపించుకొంది…. కనుక ఆ గెలుపు ఓ గెలుపు కాదు. నాలుగు ఎమ్మెల్సీ సీట్లు టిడిపి గెలుచుకొన్నంత మాత్రన్న వైసీపీకి పెద్ద నష్టమేమీ లేదు,” అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే, ఫలితాలు వెలువడిన 12 గంటలలోపే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసుకొంది వైసీపీ. ఇప్పుడు హడావుడిగా మంత్రులను కూడా మార్చేసుకొంటోంది. అంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్టే అని స్పష్టమవుతోంది కదా?

ఏది ఏమైన్నప్పటికీ సీదిరి అప్పలరాజు గారి మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగా ముగుసిపోతోంది పాపం! కానీ తాను పదవి పోయినా మంత్రినే అని అనుకొంటానని చెప్పుకొంటున్నారు కనుక ఎవరూ బాధపడక్కరలేదేమో?

ADVERTISEMENT
Latest Stories