
ప్రజలు ఎన్నుకున్న రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను నడిపిస్తాయి. కానీ ప్రభుత్వాలు మారినా దానిలో శాఖలు, వ్యవస్థలు, అధికారులు, ఉద్యోగులు మారరు. కనుక ప్రభుత్వం మారినప్పుడల్లా వారందరూ దాని నిర్ణయాలు, విధానాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.
కానీ జగన్ ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అధికారులు చాలా అతి చేశారు. అలాంటి వారందరినీ ఎన్నికల సమయంలోనే ఈసీ ఏరి పక్కన పెట్టేయగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎస్ జవహార్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజిత్ భార్గవ, మురళీధర్ రెడ్డితో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి సమర్ధులైన అధికారులతో టీమ్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
జగన్ వీరవిధేయుడుగా పేరు సంపాదించుకున్న డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డిని ఈసీ పక్కన పెట్టేసి ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాని నియమించగా, ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు గుప్తాని హోమ్ శాఖ కార్యదర్శిగా నియమించి, ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా చేస్తున్న ద్వారకా తిరుమల రావుని ఆంధ్రప్రదేశ్ డిజిపిగా నియమించారు.
ప్రభుత్వం మారినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, ఇటువంటి మార్పులు చేర్పులు సహజమే. కానీ అధికారంలో ఉన్నవారి మెప్పు కోసం పరిధి దాటి వ్యవహరించేవారి పరిస్థితి ఏవిదంగా ఉంటుందో, ఈ రాజకీయాలకు దూరంగా తమ డ్యూటీలు చేసుకునేవారి పరిస్థితి ఏవిదంగా ఉంటుందో ఈ మార్పులు చేర్పులని చూస్తే అర్దం అవుతుంది.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనో లేదా రాబోయే ఎన్నికలలో తామే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమా లేదా భ్రమలో ఉండటం సహజమే. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వాటి గురించి అలాగే భావిస్తూ, వాటి కోసం తమ పరిధి దాటి వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉదాహరణకు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గతంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంలో జైలుకి వెళ్ళవలసి వచ్చింది. కనుక మళ్ళీ ఆమె డ్యూటీలో చేరినప్పుడు మళ్ళీ అటువంటి తప్పులు చేయరనే ఎవరైనా భావిస్తారు. కానీ జగన్ కోసం మళ్ళీ అనేక తప్పులు చేశారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఆమెను కూడా పక్కన పెట్టేశారు.
Also Read – ట్రంప్-మోడీ భేటీ ఎవరిది పైచేయి?
కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరూ ఇంతకాలం జగన్ ప్రభుత్వంలో పనిచేసినవారే. కానీ వారందరూ తమ పరిధికి లోబడి పని చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ జగన్ వారిని ఏమీ చేయలేకపోయారు.
కనుక ఇకనైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే వారికే మంచిది. అదే వారికి శ్రీరామరక్షగా నిలిచి కాపాడుతుందని గ్రహిస్తే మంచిది.