సంక్రాంతి పండగకు విడుదలై, బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా నిలబడిన “జై సింహా” నిర్మాత సి.కళ్యాణ్ కార్యాలయంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమాకు సినీ విమర్శకులు పెదవి విరువగా, మాస్ ప్రేక్షకులు మాత్రం పట్టం కట్టారు. బాక్సాఫీస్ వద్ద మరో చిత్రం లేకపోవడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో ‘జై సింహా’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నిర్మాతల పాలిట సేఫ్ ప్రాజెక్ట్ గా మారుతోంది.
అయితే మరి ఇలాంటి తరుణంలో సదరు చిత్ర నిర్మాత కార్యాలయంపై సోదాలు నిర్వహించడం అనేది కేవలం ‘జై సింహా’ చిత్రానికి సంబంధించిన అంశమేనా? లేక గతంలో సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రాల గురించా? అన్నది తెలియాల్సి ఉంది. నిర్మాతగా సి.కళ్యాణ్ పై గతంలో కూడా అనేక ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలను మాత్రమే నిర్మించే సి.కళ్యాణ్, గత కొన్ని సంవత్సరాలుగా భారీ బడ్జెట్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన విషయం సినీ విజ్ఞులకు విదితమే.



