ఇండియా – ఇంగ్లాండ్ మధ్య విశాఖ వేదికగా ప్రారంభమైన తొలి రెండవ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఇంగ్లాండ్ బౌలర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. గంభీర్ ను పక్కనపెట్టి రాహుల్ ను ఓపెనర్ గా దించినా ప్రయోజనం లేకపోయింది. రెండవ ఓవర్ లోనే బ్రాండ్ బౌలింగ్ లో డకౌట్ గా పెవిలియన్ చేరుకున్నాడు రాహుల్. అలాగే 5వ ఓవర్ లో మరో ఓపెనర్ మురళీ విజయ్ (20) కూడా అవుట్ కావడంతో, 22 పరుగులకే ఇద్దరి ఓపెనర్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
దీంతో జట్టును గాడిలో పెట్టే బాధ్యత చటేశ్వర పుజారా, విరాట్ కోహ్లిలపై పడింది. తొలి సెషన్ లో మరో వికెట్ కోల్పోకుండా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ, రెండవ సెషన్ లో మాత్రం తమ ప్రతిభ ఏమిటో చూపించారు. ఇద్దరూ పోటీపడి మరీ పరుగులు చేసారు. వీరి వేగానికి టీమిండియా స్కోర్ బోర్డు రెండవ సెషన్ లోనే 200 పరుగులు మైలురాయిని దాటింది. ఒకానొక దశలో ఎవరు ముందు సెంచరీ చేస్తారో అన్న ఆసక్తి కూడా ప్రేక్షకులలో వ్యక్తమైంది.
ముందుగా పుజారా చేస్తాడని భావించగా, ఆ తర్వాత వరుస బౌండరీలతో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ తో సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ వెనువెంటనే పుజారా ఓ భారీ సిక్సర్ ను బాది తన సెంచరీని అందుకున్నాడు. మాంచి ఊపు మీదున్న సమయంలో పుజారా తన వ్యక్తిగత స్కోర్ 119 పరుగుల వద్ద వెనుతిరగడంతో 226 పరుగుల భాగస్వామ్యంకు బ్రేక్ పడింది. ఇక, ఆట ముగిసేందుకు మరో ఓవర్ ఉందనగా, రహనే (23) పరుగుల వద్ద వెనుతిరిగాడు.
దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేయగా, క్రీజులో కెప్టెన్ కోహ్లి 151, అశ్విన్ 1 పరుగుతో ఉన్నారు. కోహ్లి అద్భుతమైన ఫాంలో ఉండడంతో, రెండవ రోజు కూడా ఇదే మాదిరి చెలరేగితే జట్టు స్కోర్ 500 మార్క్ ను అందుకోవడం అవలీలగా మారుతుంది. మూడవ రోజు నుండి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉండడంతో, తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధిస్తే… మ్యాచ్ పై టీమిండియా పట్టు సాధించినట్లే చెప్పవచ్చు. ఈ క్రమంలో కోహ్లి డబుల్ సెంచరీకి కూడా అవకాశం ఉంది.



