ఎంతో ప్రామిసింగ్ గా దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా తొలి టెస్ట్ లో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందులు పడుతోంది. సఫారీలను తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్ విభాగంలో మాత్రం చేతులెత్తేసింది. టాప్ ఎండ్ లో ఒక్క బ్యాట్స్ మెన్ కూడా సరైన రీతిలో ఆడకపోవడంతో, ఒక దశలో 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం తప్పదు అనుకున్న సఫారీలకు చుక్కలు చూపించాడు పాండ్య.
ఇటీవల కాలంలో బౌలింగ్ తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతోన్న పాండ్య 95 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ తో 93 పరుగులు చేసి టీమిండియా పరువు నిలిపాడు. భువనేశ్వర్ కుమార్ (25)తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పాండ్య, సెంచరీకి చేరువైన క్షణంలో వెనుతిరిగాడు. అద్భుతమైన షాట్లతో అలరించిన పాండ్య ఇన్నింగ్స్ కు వీక్షకులు ముగ్ధులయ్యారు. దీంతో టీమిండియా గౌరవప్రదమైన 209 స్కోర్ చేయగలిగింది.
తొలి ఇన్నింగ్స్ లో 77 పరుగుల ఆధిక్యంలో ఉన్న సఫారీలను రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా కట్టడి చేయలేని పక్షంలో తొలి టెస్ట్ లో భంగపాటుకు గురయ్యే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటివరకు సొంత గడ్డలపై టన్నుల కొద్ది సెంచరీలు బాదుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అండ్ కోలకు సఫారీ పిచ్ లపై పరుగులు చేయడం ఛాలెంజింగ్ గా మారింది. మరోవైపు సొంత గడ్డపై నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా భరతం పడతాం అంటున్నారు సఫారీలు.



