ఫాం లేక సతమతమవుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, ఎట్టకేలకు అయిదవ వన్డే మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాను క్రీజులో ఉండగా కెప్టెన్ విరాట్ కోహ్లి, రహనేలు రనౌట్ కావడంతో తన సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పిన రోహిత్ శర్మ, ఈ క్రమంలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు.
తాను సాధించిన 115 పరుగులలో 11 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ, భారత్ తరపున అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్లలో రెండవ స్థానానికి చేరుకున్నాడు. మొదటి స్థానంలో 331 సిక్సర్లతో మహేంద్ర సింగ్ ధోని నిలువగా, 265 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో సచిన్ టెండూల్కర్ 264, నాలుగవ స్థానంలో యువరాజ్ సింగ్ 249, అయిదవ స్థానంలో గంగూలీ 246 సిక్సర్లతో ఉన్నారు.
అలాగే టీమిండియా తరపున ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో సెహ్వాగ్ ను దాటి మూడవ స్థానానికి చేరుకున్నాడు రోహిత్. మాస్టర్ బ్లాస్టర్ 45 సెంచరీలతో, గంగూలీ 19 సెంచరీలతో మొదటి రెండు స్థానాలలో నిలువగా, 15 సెంచరీలతో మూడవ స్థానంలో రోహిత్, 14 సెంచరీలతో సెహ్వాగ్ నాలుగవ స్థానంలో నిలిచాడు. గత నాలుగు సార్లుగా విరాట్ కోహ్లిని రనౌట్ చేసిన ప్రతిసారి రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కడం మరో విశేషం.



