వారం రోజుల తర్వాత కూడా ఇండిగో విమానాలు రద్దు అవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ మిత్ర పక్షాలు, బీజేపి, మోడీని వ్యతిరేకిస్తున్నవారు ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రయాణికులు ఇండిగో సంస్థని నిందిస్తున్నారు. కానీ ఇండిగో ఎవరినీ నిందించలేదు కనుక మౌనంగా ఉండిపోయింది!
కనుక కేంద్ర ప్రభుత్వం, ఇండిగో సంస్థ రెంటిలో దేనిది తప్పు?అంటే ఇండిగోదే అని తేల్చిచెప్పేశారు ప్రధాని మోడీ, పౌరవిమాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరూ!
నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కనుక ఇండిగోపై చర్యలు తప్పవని రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో హెచ్చరించారు.
తాజా సమాచారం ప్రకారం ఇందుకుగాను ఇండిగో సంస్థకి కేటాయించిన ‘టైమ్ స్లాట్స్’లో 5 శాతం కోత విధించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే రోజుకి సుమారు 100-110 విమానాలు తగ్గబోతున్నాయి.
ఈ సంక్షోభం కారణంగా ఇండిగో సంస్థ ఇప్పటికే వేలకోట్లు నష్టపోయింది. కనుక ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇండిగోకి అవసరమైన చేయూత నిచ్చి ఆదుకోవాలి. కానీ ఒకవేళ 5 శాతం కోత నిజమే అనుకుంటే, ఇండిగోని ఇంకా సంక్షోభంలోకి నెట్టేసి తద్వారా నష్టాల ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తున్నట్లే కదా?
దేశీయ విమానయాన సంస్థలలో ఇండిగో ప్రయాణికుల వాటా 60శాతం పైనే. ఓ వారం రోజులు ఇండిగోలు గాల్లోకి ఎగరకపోతే దేశవ్యాప్తంగా ఇన్ని వేలమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సరికొత్త ఆంక్ష కారణంగా ఇండిగో నష్టాల ఊబిలో కూరుకుపోయి మూతపడితే?కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయం ఉందా?
ఇండిగో సమస్య మొదలైన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారం రోజులుగా సంక్షోభం నెలకొని ఉంటే సమస్యని పరిష్కరించలేకపోయింది.
సమస్య గురించి దేశ ప్రజలకు, ముఖ్యంగా ఇండిగో ప్రయాణికులకు వివరించే ప్రయత్నం చేయలేదు. అందువల్ల మరిన్ని పుకార్లు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటితో రాజకీయాలు కూడా మొదలైపోయాయి.
పరిశ్రమలు, పెట్టుబడుల కోసం ఓ పక్క దేశంలో గ్లోబల్ సదస్సులు నిర్వహిస్తూ, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ చిక్కుల్లో పడితే దానిని ఈవిధంగా డీల్ చేయడం సబబేనా?




