ఇండిగో సంస్థ దేశంలో విమాన ప్రయాణికులలో 60 శాతం వాటా కలిగి ఉంది. అంత పెద్ద సంస్థకు చెందిన విమానాలన్నీ గత 5 రోజులుగా వరుసగా రద్దు అవుతున్నాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డజన్ల కొద్దీ విమానాలు రద్దవుతుండటం వలన ఇండిగో తీవ్రంగా నష్టపోతోంది. అదే సమయంలో టికెట్ సొమ్ము ప్రయాణికులకు తిరిగి చెల్లించాల్సి వస్తోంది. ఒకేసారి ఇన్ని విమానాలు రద్దు అవుతుండటంతో తీరని అప్రదిష్ట, ప్రయాణికుల శాపనార్థాలు తప్పడం లేదు.
ఇంటికి మంటలు అంటుకొని ఒకరు ఏడుస్తుంటే చుట్టకి నిప్పు దొరికిందని మరొకడు సంతోషించాడన్నట్లు ఇండిగో సంస్థ ఇంత పెద్ద సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతుంటే, మిగిలిన సంస్థలు ఇదే అదునుగా అడ్డుగోలుగా టికెట్ ఛార్జీలు పెంచేసి ప్రయాణికులను దోచుకుంటున్నాయి.
అందినకాడికి దండుకుంటున్నాయి. టికెట్ ఛార్జీలు పెంచితే కటిన చర్యలు తప్పావని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలను అవి పట్టించుకోవడం లేదు.
ఇందుకు తాజా నిదర్శనంగా ఎయిర్ ఇండియా గురించి చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకు అత్యంత చవుకగా రూ.11, 721 గరిష్టంగా రూ.18,377 చొప్పున వసూలు చేస్తోంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానం 45-55 నిమిషాల ప్రయాణం. ఈ మాత్రం ప్రయాణానికి ఇంతేసి వసూలు చేస్తోంది. ఇది దోపిడీ కాదా?
దేశంలో ఒక విమానయాన సంస్థ దెబ్బ తింటే ఎంత అనర్ధం జరుగుతుందో ఇండిగోతో స్పష్టమవుతోంది. కనుక విమానాశ్రయాల నిర్మాణం కంటే ముందు మరిన్ని విమానాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలి. ఆ విమానాల ఛార్జీలు సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండాలి. అప్పుడే ఇలాంటి సాంకేతిక విపత్తులు అధిగమించగలుతాము.







