అమరావతిలో మరో తాత్కాలిక భవనం రాబోతుంది. పరిపాలన నగరంలో శాశ్వత హైకోర్టు నిర్మించే ప్రాంతానికి సమీపంలో సిటీ సివిల్ కోర్టు భవనం నిర్మించనున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఇందులో ఏర్పాటుచేస్తారు. శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యాక, హైకోర్టుని అక్కడికి తరలించి, ఈ భవనంలో సిటీ సివిల్ కోర్టు ఏర్పాటుచేస్తారు.
సిటీ సివిల్ కోర్టు భవనాన్ని జీ+5 విధానంలో నిర్మిస్తారు. 1.96 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. రూ.108కోట్లు వ్యయమవుతుందని అంచనా. 8నెలల్లో నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇది ఇలా ఉండగా దీనిబట్టి మనకి తెలిసేది ఏమిటంటే రాజధానిలోని శాశ్వత నిర్మాణాలు ఇప్పట్లో మొదలు అయ్యేలా కనిపించడం లేదు.
రాజధాని నిర్మాణం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడం, రాష్ట్రానికి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఉండటం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మొత్తానికి చెయ్యి ఇవ్వడం వంటివాటితో శాశ్వత నిర్మాణాలు ఇప్పట్లో చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. తాత్కాలిక భవనాల ద్వారా ముఖ్యమంత్రి ఆ విషయాన్నీ చెప్పకనే చెబుతున్నారు.



