ఇంటర్ విద్యార్థులకు…ఏపీ ఎన్నికలు మరో గండం కానున్నాయా..?

Intermediate Examinations

స్కూల్ విద్య వరకు ఆడుతూపాడుతూ చదువుకున్న విద్యార్థులకు ఇంటర్ విద్యాభ్యాసమే ఒక గండంలా మారిపోయింది. అటు ర్యాంకుల కోసం విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు పోటాపోటీ ఒత్తిడిని పిల్లలకు అందిస్తుంటారు. ఇప్పుడు వారికి తోడు రాజకీయ పార్టీలు, వారి నిర్ణయాలు కూడా ఇంటర్ విద్యార్థుల పాలిట బొమ్మాళిగా మారిపోయాయి.

2024 ఏపీలో జరగనున్న ఎన్నికలు ఇంటర్ విద్యార్థులకు కరోనా కన్నా ఎక్కువ భయపెడుతున్నాయి. ఇంటర్ పరీక్షా తేదీల పై రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో విద్యార్థులలో, వారి తల్లిదండ్రులలో ఆందోళన మొదలయ్యింది.జనవరిలో జరిగే మైన్స్ ఎగ్జామ్స్ పైనే అప్పటివరకు ఫోకస్ చేసే విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ పరీక్షలు ముందుకు రానున్నాయి అనే వార్త టెన్షన్ పుట్టిస్తుంది.

ADVERTISEMENT

మాములుగా అయితే మార్చి రెండు మూడు వారాలలో జరిగే పరిక్షలు ఇప్పుడు ఎన్నికల కారణంగా మార్చి మొదటి వారానికి వచ్చాయంటూ, లేదు లేదు ఫిబ్రవరి లాస్ట్ వారం నుండే మొదలవుతాయంటూ వార్తలు చక్కర్లు కొట్టడంతో అసలు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనే ఉత్కంఠ విద్యార్థులలో మొదలయ్యింది.నిమిషం నిమిషం ఎంతో విలువైనదిగా భావించే విద్యార్థులకు రెండు వారాల సమయం కుదించడం అంటే వారికి అది కత్తి మీద సాము వంటిదే.

రివిజన్ కు సమయం సరిపోదు, ర్యాంకుల కోసం కాలేజీ సిబ్బంది ఒత్తిడి, మార్కుల కోసం తల్లిదండ్రుల ఆరాటంతో విద్యార్థులలో స్ట్రస్ ఎక్కువయ్యి ఆశించిన ఫలితాలు రాకపోవడం నిరాశతో తప్పుడు నిర్ణయాల వైపు మొగ్గుచూపి తమ విలువైన జీవితాన్ని పణంగా పెడతారు. దీని వలన నష్ట పోయేది తల్లిదండ్రులు, విద్యార్థులే కానీ రాజకీయ పార్టీలు కాదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలకు ఎన్నికలను విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా నిర్వించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.

తమ సంక్షేమమే తమను గెలిపిస్తుంది అని నమ్మిన అధికార పార్టీ, అధికార పార్టీ అనాలోచిత నిర్ణయాలే తమ గెలుపుకి బాటలు వేస్తాయి అంటూ చెప్పుకునే ప్రతిపక్షాలు ఒక అడుగు వెనకకో, లేక ఒక అడుగు ముందుకో వేయాలే తప్పా విద్యార్థులను ఒత్తిడిలో పడేసే నిర్ణయాలు తీసుకోకూడదు.ఎన్నికల షెడ్యూల్ నెల ముందుకో నెల వెనక్కో వెళ్లడం వలన రాజకీయ పార్టీల నాలుగేళ్ళ కష్టం వృధా అయిపోతుందా..?

ఈ నాలుగున్నరేళ్ల కష్టం ఒక నెలలో డిసైడ్ అవుతుందా..?గెలుపు కోసం నాలుగున్నరేళ్లు వేచి చూసిన ప్రతిపక్షాలు కానీ, గెలుపు మీద నమ్మకం పెట్టుకున్న అధికార పార్టీ కానీ విద్యార్థుల భవిష్యత్ కోసం వారి నిర్ణయాన్ని మార్చుకోలేరా..?ఎప్పుడు రాజకీయ పార్టీల అవసరాల కోసం ప్రజలే త్యాగాలు చేయాలా..? ప్రజల అవసరాలు రాజకీయ పార్టీలకు పట్టవా..? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రాజకీయ పార్టీలను సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories