శ్రేయాస్ ‘సూపర్’ కొట్టుడు!

Gujarat Lions vs Delhi Daredevils, IPL 2017ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ సీజన్ నుండి వైదొలగిన రెండు జట్లు గుజరాత్ లయన్స్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయం వలన చేకూరిన ప్రయోజనం ఏమీ లేకపోవడంతో, ఈ మ్యాచ్ కు ప్రాధాన్యత తగ్గిపోయింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారడంతో, ప్రేక్షకులు పండగ చేసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఫించ్ 39 బంతుల్లో 69, దినేష్ కార్తీక్ 40, ఇషాన్ కిషన్ 34 పరుగులతో రాణించగా, చివర్లో జడేజా, ఫాల్కనర్ లు తమ చేయిని కూడా అందించారు. అయితే ఈ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో భారీ స్కోర్లను చేధించిన అనుభవం ఉన్న ఢిల్లీ జట్టు, రెండు ఓవర్లు ముగిసే సమయానికే రెండు కీలక వికెట్లు సంజూ శాంసన్, రిషబ్ పంత్ లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ADVERTISEMENT

అయితే క్రీజులో ఉన్న కరుణ నాయర్, శ్రేయాస్ అయార్ లు వెనుకడుగు వేయకుండా భారీ షాట్లతో విరుచుకుపడడంతో రన్ రేట్ వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు. కరుణ నాయర్ 30 పరుగులు చేసి ఔటైన తర్వాత శ్రేయాస్ కు సహకారం అందించే బ్యాట్స్ మెన్లు లేక వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది ఢిల్లీ. కానీ జట్టు విజయమే లక్ష్యంగా సాగిన శ్రేయాస్ అయార్ 57 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేసి చివరి ఓవర్ లో పెవిలియన్ చేరుకున్నాడు.

అద్భుతమైన సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన శ్రేయాస్ వెనుదిరిగే సమయానికి, 4 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. అయితే క్రీజులోకి వచ్చిన అమిత్ మిశ్రా తొలి రెండు బంతులను రెండు బౌండరీలుగా మలిచి, ఢిల్లీకి అపూర్వ విజయాన్ని అందించాడు. దీంతో 10 పాయింట్లతో ఢిల్లీ 6వ స్థానంలో, గుజరాత్ జట్టు 8 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భవితవ్యం తేలబోయే మ్యాచ్ నేడు ముంబై ఇండియన్స్ తో ముంబై వేదికగా జరగనుంది.

ADVERTISEMENT
Latest Stories