ఏపీలో ఎన్నికల సందర్భంగా అధికార-ప్రతిపక్షాల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధాల మద్యలో ఇరాన్-ఇజ్రాయల్ యుద్ధం గురించి మాట్లాడితే పానకంలో పుడకలాగే ఉంటుంది. అయితే భారత్‌లో ఎక్కడో ఓ ప్రేలుడు జరిగితేనే ఉలిక్కిపడుతున్నప్పుడు, ఒక దేశం మరో దేశం మీద ఏకంగా 100కి పైగా డ్రోన్లు, 70కిపైగా క్షిపణులతో దాడి చేస్తే దానిని పట్టించుకోకుండా ఉండలేము.
పశ్చిమాసియా దేశాలైన ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మద్య యుద్ధం ప్రారంభమైంది. శనివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇరాన్ ముందే హెచ్చరించడంతో ఈ దాడిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న ఇజ్రాయెల్, దానికి అండగా నిలిచిన అమెరికా కలిసి వాటిని గాల్లోనే పేల్చేయడంతో పెను విధ్వంసం తప్పింది.
సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారచర్యగానే తాము ఈ దాడులు చేశాము తప్ప ఇజ్రాయెల్‌తో యుద్ధం చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తే ఇరాన్ తప్పక ధీటుగా బదులిస్తుందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు.
అయితే ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసి తమ పౌరులను బందీలుగా పట్టుకుపోతేనే గత కొన్ని నెలలుగా పాలస్తీన మీద విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్, తమ దేశంపై బాంబుల వర్షం కురిపించి కవ్వించిన ఇరాన్‌ని ఉపేక్షించదు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయబోతోందని అమెరికా ముందే హెచ్చరించడమే కాకుండా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలను, క్షిపనులను కూల్చివేసింది. ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని అమెరికా ప్రకటించింది. అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించాయి.
ఇప్పటికే దాదాపు రెండేళ్ళుగా ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు చేస్తూనే ఉంది. కనుక అమెరికా, ఫ్రాన్స్ తదితర నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు అందిస్తుండటం వలననే అది నేటికీ రష్యాపై ఎదురు దాడులు చేయగలుగుతోంది. కనుక రష్యా ఆయా దేశాలపై తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ మద్య యుద్ధం మొదలైతే ఆ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా రంగంలో దిగితే, రష్యా కూడా ఇరాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం అందించకమానదు.
మరోపక్క అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ తీరుని చాలా కాలంగా నిరసిస్తూనే ఉన్నాయి. అయితే వాటికి అమెరికా, ఇజ్రాయెల్‌తో తలపడే ఆయుధ సంపత్తి లేదు. కానీ యుద్ధం మొదలైతే ఇరాన్‌కు ఆర్ధికంగా సాయపడగలవు.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మద్య యుద్ధంతోనే భారత్‌తో సహా ప్రపంచ దేశాలు ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మద్య యుద్ధం జరిగితే ఈసారి భారత్ మళ్ళీ ఆయిల్ సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఆయిల్ ధరలు పెరిగితే సరుకు రవాణా, నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయని వేరే చెప్పక్కర లేదు. అయితే కేవలం ధరల పెరుగుదలతో ఆగితే పర్వాలేదు. కానీ యుద్ధం ఆసియా దేశాలకు విస్తరిస్తే మాత్రం భారత్ చేతులు ముడుచుకొని కూర్చోలేదు.
కనుక తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలిన్నట్లు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగితే అది భారత్‌తో సహా ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. అందుకే వైసీపి-టిడిపి, జనసేన, బీజేపీల యుద్ధంలో ఇది పానకంలో పుడకగా అనిపిస్తున్నప్పటికీ చెప్పుకోక తప్పదు.




