తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ నాటి అగ్ర హీరోలలో ఒకరుగా వెలుగొంది తెలుగు సినిమా మన్మథుడిగా పేరు తెచ్చుకున్నారు.
తన తండ్రి వారసత్వాన్ని తానూ కొనసాగించినట్టు తన అక్కినేని వారసత్వాన్ని తన కుమారులు నాగ చైత్యన, అఖిల్ కు అప్పగించారు నాగార్జున. అయితే గత కొద్దికాలంగా ఈ అక్కినేని వారుసలకు కాలం కలిసి రావడం లేదు.
సీనియర్ హీరో నాగార్జున మొదలుకుని జూనియర్ హీరోగా ఉన్న అఖిల్ వరకు అక్కినేని వారి సినిమాలు థియేటర్లలోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. అఖిల్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అరంగేట్రం చేసిన అఖిల్ ఇంతవరకు ఆ బ్రాండ్ కు తగ్గ హిట్ అందుకోలేకపోయారు. వరుస ఫ్లాప్ లతో అక్కినేని అభిమానులను పూర్తి నిరాశలోకి తీసుకు వెళ్లారు అఖిల్.
నాగ చైత్యన జోష్ సినిమాతో సినీ అరంగేట్రం చేసినప్పటికీ మొదటి సినిమా అక్కినేని అభిమానులకు అనుకున్న జోష్ ఇవ్వలేకపోయింది. ఆతరువాత వచ్చిన ఎం మాయ చేసావే, మనం, లవ్ స్టోరీ, మజిలీ తో సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ చై ఖాతాలో ఫ్లాప్ మూవీస్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
వ్యక్తిగత వివాదాలతో కాస్త గ్యాప్ తీసుకుని సాయిపల్లవి తో కలిసి తండేల్ మూవీతో మళ్ళీ థియేటర్ల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు చైతన్య. ఇక సీనియర్ హీరోగా ఉన్న నాగార్జున కూడా మునుపటి క్రేజ్ ను, ఆ స్థాయి హిట్లను అందుకోలేకపోతున్నారు. సింగల్ హీరోగా వచ్చి సోగ్గాడు సినిమాతో హిట్ అందుకున్న నాగార్జున ఇప్పటి వరకు తన ఖాతాలో మరో హిట్ వేసుకోలేకపోయారు.
90 హీరోలలో చిరు, బాలయ్య ఇండస్ట్రీలో తమ క్రేజ్ ను నిలుపుకున్నప్పటికీ నాగార్జున ఆ విషయంలో కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ తో బుల్లి తేరా మీద అలరించిన నాగార్జున వెండి తెర మీద కాస్త తడబడుతున్నారనే చెప్పాలి. ఇప్పుడు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కెరీర్లు గాడిన పడి పూర్వ వైభవం అందుకోవాలంటే వారందరికీ ఒక భారీ హిట్ తప్పనిసరి.




