తమ అధినేత మెప్పు కోసం వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలు పడి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను తిడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. దాంతో వారి మంత్రి పదవులు నిలవవు… రావని మంత్రివర్గ విస్తరణతోనే స్పష్టమైపోయింది.
వారి ముగ్గురినీ అంతగా తిడుతున్నందుకు కనీసం వచ్చే ఎన్నికలలో తప్పకుండా పార్టీ టికెట్స్ అయిన లభిస్తాయా? అంటే లేదని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పేశారు. సర్వేలో మంచి మార్కులు వస్తేనే టికెట్స్ అని చెప్పేయడంతో అందరూ గడప గడపకి వెళ్ళి ప్రజల తిట్లు, ఛీత్కారాలు, శాపనార్ధాలు భరిస్తున్నారు. అంటే ప్రజలలో తమపట్ల ఎంత వ్యతిరేకత ఉందో కళ్ళారా చూస్తున్న వైసీపీ నేతలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను తిడుతున్నప్పటికీ మంత్రి పదవులు రావు… కానీ వారు ముగ్గురినీ నోటికి వచ్చినట్లు తిడుతుండటం వలన ఆయా వర్గాలకు చెందిన ప్రజలు తమపై ఆగ్రహంగా ఉన్నారనే విషయం చాలా ఆలస్యంగా గ్రహించారు. ఆర్‌కె. రోజా, అంబటి రాంబాబు వంటివారు మంత్రి పదవి అనే గంతలు కట్టుకొని ఉన్నారు కనుక బహుశః వారు ఈ విషయం ఇంకా గ్రహించకపోయి ఉండడవచ్చు.
తమ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని సర్వేలో తేలితే టికెట్స్ కూడా రావని స్పష్టమైంది. మరిప్పుడు ఏం చేయాలి? అంటే వేరే పార్టీలోకి మారాలి. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం కనిపిస్తున్నవి టిడిపి, జనసేన పార్టీలు మాత్రమే. కానీ తమ అధినేత మెప్పుకోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను నోటికి వచ్చినట్లు తిట్టడం వలన ఆ పార్టీల ద్వారాలు మూసుకుపోయాయి.
నిజం చెప్పాలంటే వారికి ద్వారాలు మూసుకుపోయేలా చేసింది సిఎం వారి అధినేత జగన్మోహన్ రెడ్డే అని చెప్పక తప్పదు. అప్పుడు వారు వేరే పార్టీలోకి వెళ్ళలేక, పదవులు, టికెట్స్ ఇవ్వకపోయినా వైసీపీలోనే పడిఉంటారని వేరే చెప్పక్కరలేదు. ఇప్పుడు వైసీపీలో పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్‌కె. రోజా వంటి పలువురు సీనియర్ల పరిస్థితి ఇదే.
మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ తన ఆప్షన్స్ ఓపెన్‌గా ఉంచుకొన్నారని చెప్పవచ్చు. ఆయనను బందించిపడేయడానికే విద్యాశాఖ మంత్రిగా నియమించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన శాఖకు సంబందించి సిఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొంటున్న నిర్ణయాలను అమలుచేయలేక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు నచ్చజెప్పలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.
ఈవిదంగా ఎవరూ పార్టీలో నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేకుండా, సొంత పార్టీ తలుపులు, ఇతర పార్టీల తలుపులు కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి వారి చేతే మూయించేసిన్నట్లు స్పష్టమవుతోంది. మరి లోపల వైసీపీ నేతలు హ్యాపీగా ఉన్నారా?ఉంటే అంతకంటే ఏం కావాలి?



