
పెద్ద హీరోల సినిమాల మద్య ‘కలెక్షన్స్ పోటీలు’ కూడా సాగుతుంటాయి. కనుక ‘వారంలోనే ఇంత సాధించాం రెండు వారాల్లోనే అంత సాధించాం.. కలెక్షన్స్ రికార్డ్స్ బద్దలు కొట్టేశాం’ అంటూ బ్యానర్లు వేసుకొని మరీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. అభిమానులు కూడా తమ హీరోల కలెక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని యుద్ధాలు చేసుకుంటారు.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
అయితే కొన్నిసార్లు సినిమాలకి ఎదురుదెబ్బ తగిలినప్పుడు నష్టనివారణకు కూడా లేని కలెక్షన్స్ వచ్చిన్నట్లు చాటింపు వేసుకుని సినిమాని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఏది ఏమైనప్పటికీ ఆయా నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా, బహిరంగ వేదికలపై చెప్పినవన్నీ ఆదాయపన్ను శాఖకి సమర్పించిన ఐటి రిటర్న్స్ గానే పరిగణించినప్పుడే సమస్య మొదలవుతుంది.
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాల నిర్మాతలు దిల్‌రాజు, ఆయన కుమార్తె హన్సిత రెడ్డి, నిర్మాత శిరీష్, దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్‌రాజు ప్రొడక్షన్స్, ఇంకా పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఆ సంస్థ అధినేతలు, వారి భాగస్వాముల ఇళ్ళలో మంగళవారం ఉదయం నుంచి ఏక కాలంలో ఐటి దాడులు జరుగుతున్నాయి.
సింగర్ సునీత భర్త రాముకి చెందిన మ్యాంగో మీడియా కూడా వీటిలో భాగస్వామిగా ఉంది కనుక ఆ సంస్థలో, వారి ఇంట్లో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,900 కోట్లు కలెక్షన్స్ సాధించిందని మైత్రీ మూవీ మేకర్స్ స్వయంగా చాటుకుంది. ఆ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.173 కోట్లు తీసుకున్నారని దర్శకుడు రాంగోపాల్ వర్మ బయటపెట్టారు.
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ అయ్యిందని ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆ సినిమా డాకూ మహరాజ్ కంటే జోరుగా కలెక్షన్స్ సాధిస్తోందని సదరు నిర్మాణ సంస్థే గొప్పగా చెప్పుకుంది.
కనుక సినిమాల ఆదాయం గురించి ఐటి అధికారులు సమాచారం కోసం ఎక్కడో వెతకనవసరం లేదు. దర్శక నిర్మాతలు, అభిమానులే వారికి సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నారు. కనుక ఐటి శాఖ దాడులు జరుగకపోతే ఆశ్చర్యపడాలి కానీ జరిగితే కాదు.