చాలాకాలంగా పాత సినిమాల్లోని హిట్ పాటలను ఇప్పటి సినిమాల్లో రీమిక్స్ చేయడం ట్రెండ్‌గా మారిపోతోంది. దాదాపు 30 ఏళ్ల కిందట వచ్చిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘తేజాబ్’లోని “ఏక్..దో..తీన్..”పాటను ఇపుడు మరోసారి రీమిక్స్ చేయబోతున్నారు. ఆ పాటతో అందాల రాశి మాధురీ దీక్షిత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇపుడు అదే పాటను టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా నటిస్తున్న భాగీ-2 చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. దానికి ముద్దుగుమ్మ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ స్టెప్పులు వేయనుంది. ఈ స్పెషల్ సాంగ్‌ను మూడు రోజుల పాటు షూట్ చేయనున్నారట.
లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఎవర్‌గ్రీన్ హిట్ “ఏక్..దో..తీన్..”పాటకు జాక్వెలైన్ డాన్స్ చేయనుంది. ఆ పాటకు అప్పట్లో అల్కా యాగ్నిక్ కు ఉత్తమ గాయనిగా ‘బ్లాక్ లేడీ’, సరోజ్ ఖాన్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డులు దక్కాయి. “చోలీ కే పీచే క్యా హై…” పాట నుండి సరోజ్‌కు సహాయకుడిగా పనిచేసిన అహ్మద్ ఖాన్ భాగీ-2 సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఒరిజినల్ “ఏక్..దో..తీన్..”పాటలో బ్యాక్ అప్ డాన్సర్లలో ఒకరైన గణేశ్ ఆచార్య ఈ రీమిక్స్ పాటకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ పాట కోసం మొత్తం ముగ్గురు కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నట్లు అహ్మద్ చెప్పారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాస్ట్యూమ్స్ బాధ్యతను మనీష్ మల్హోత్రాకి అప్పగించారు. గతంలో జాక్వెలైన్‌తో చేసిన పాటల వల్ల మాధురీ ప్లేస్‌లో ఆమే సరైన ఎంపిక అని అహ్మద్ అంటున్నారు. మరి.. సినిమా రిలీజయ్యాక వెండితెరను జాక్వెలైన్ ఏ రేంజ్‌లో హీటెక్కిస్తుందో చూడాలి.



