జగన్‌ ఢిల్లీ పర్యటన ముందస్తు కోసమేనా?

Amit-Shah-Jaganఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా విభజన హామీలు, నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలతో చర్చించేందుకే వెళుతున్నారని వైసీపీ చెప్పుకొంటుంది. అయితే నాలుగేళ్ళుగా ఢిల్లీ పెద్దల చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా నేటికీ విభజన హామీలు అమలు కాలేదనే సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

సంక్షేమ పధకాల కోసం అప్పులు, కేసుల నుంచి ఉపశమనం కోసం ఢిల్లీకి వెళ్ళి వస్తుంటారని ప్రతిపక్షాలు వాదిస్తూనే ఉంటాయి. జగన్‌ ఢిల్లీ పర్యటనలకు ఎవరెన్ని అర్ధాలు, పరమార్ధాలు చెప్పుకొన్నా వాటిని పట్టించుకోకుండా నెలకోమారు ఢిల్లీ వెళ్ళి వస్తూనే ఉన్నారు.

మళ్ళీ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. రెండు రోజులు అక్కడే మకాం వేసి ‘వాటి కోసమే’ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, తదితరులను కలుస్తారని వైసీపీ చెప్పుకొంటోంది. అయితే ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు అనుమతి కోరేందుకు వెళుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో మరో 4-5 నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక కేంద్ర ఎన్నికల కమీషన్‌ దాని కోసం అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టేసింది. కనుక తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికల నిర్వహించాలనుకొంటున్న సిఎం జగన్‌, మోడీ, అమిత్‌ షాల అనుమతి తీసుకొనేందుకు ఢిల్లీకి వెళ్ళారని ఆ గుసగుసల సారాంశం.

దానికి బలమైన కారణమే ఉంది. నాలుగేళ్ళుగా అష్టకష్టాలు పడుతూ సంక్షేమ పధకాల కోసం నిధులు సమీకరించుకొని క్యాలండర్ ప్రకటించి మరీ టంచనుగా చెల్లిస్తున్నది శాసనసభ ఎన్నికలలో గెలవడం కోసమే. కానీ లోక్‌సభ ఎన్నికలతో కలిసి శాసనసభ ఎన్నికలు నిర్వహించినట్లయితే వాటిలో అనేక ఇతర అంశాలు ప్రస్తావనకొస్తాయి గనుక అప్పుడు ఈ సంక్షేమ పధకాలపైనే గురించి ఎంత గట్టిగా నొక్కిచెప్పుకొన్నా ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు.

కనుక ముందస్తు ఎన్నికలకు వెళితేనే సంక్షేమ పధకాల ‘యాగ ఫలం’ లభించే అవకాశం ఉంటుంది. అయితే మోడీ, అమిత్‌ షాల అనుమతి తీసుకోకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొంటే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉంటుంది. కనుక వారి అనుమతి, ఆశీసులు తీసుకొని జగన్‌ ముందస్తుకు వెళ్ళాలనుకొంటున్నారని, ఒకవేళ వారు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే ఆగస్ట్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు జగన్‌ సిద్దంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ చాలా దూరదృష్టితో ఆలోచించి ముందస్తుకు వెళ్ళి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల మద్య లింక్ తెంచుకొన్నారు. దాంతో శాసనసభ ఎన్నికలలో రాష్ట్రానికి సంబందించిన అంశాల గురించి చెప్పుకొని గెలుస్తున్నారు. కనుక జగన్‌ కూడా ఆయన బాటలోనే ముందస్తుకు వెళ్ళేందుకు సిద్దపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్‌ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories