గడిచిన రెండు, మూడు నెలలుగా హాట్ టాపిక్ గా మారిన సినిమా టికెట్ ధరల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే దానికి జగన్ సర్కార్ కొన్ని ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ పెట్టినట్లుగా మీడియా వర్గాలలో వార్తలు వస్తున్నాయి.
అందులో ప్రధానమైనది ఏమిటంటే… టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ సినీ నటులందరూ జగన్ కు జై కొట్టాలట. ఇందుకోసమై గురువారం నాడు ఓ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో కలిసి చిరంజీవి అండ్ కో పాల్గొనాలట.
మరి జగన్ కోసం ఎవరెవరు వస్తారు? అన్న ప్రశ్న తలెత్తితే ముందుగా వచ్చే పేరు అక్కినేని నాగార్జున మాత్రమే. జగన్ కు అత్యంత ఆప్తుడు అయిన నాగ్, ఇటీవల చిరంజీవి – జగన్ కలయిక సందర్భంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఒక్క నాగ్ ను వదిలేస్తే టాలీవుడ్ అగ్ర హీరోలలో జగన్ చెంతకు చేరేందుకు మరే ఇతర హీరో కూడా సముఖంగా లేరని సమాచారం. జగన్ చెంతకు రాకపోవడానికి కొందరికి వ్యక్తిగత కారణాలు ఉండగా, మరికొందరికి రాజకీయ కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
రాజకీయాలకు అత్యంత స్వల్ప ప్రాధాన్యత ఇచ్చే మహేష్, సోదరుని మరణం తర్వాత ‘సర్కార్ వారి పాట’ సినిమా షూటింగ్ కే డుమ్మా కొట్టేసారు. ఈ పరిస్థితులలో ప్రత్యక్షంగా మహేష్ కలుసుకునే అవకాశం లేదు, సోషల్ మీడియా ట్వీట్ అయితే ఖచ్చితంగా రావొచ్చు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ అత్యంత కీలక వ్యక్తి కాగా, రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం, ఈ తరుణంలో ఏ కారణాలతో కూడా జగన్ చెంతకు చేరే అవకాశం లేదు. ఇక ప్రభాస్ ది అదే పరిస్థితి. బీజేపీతో సత్సంబంధాలు కలిగిన ప్రభాస్ ఇప్పట్లో రాజకీయ జెండా పట్టుకునే అవకాశం లేదు.
అయితే వీరందరినీ క్రోడీకరించి జగన్ చెంతకు తీసుకువెళ్లే గురుతర బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి తీసుకోవడమే అసలు ఈ చర్చకు దారి తీసింది. జగన్ కోరుకున్న అజెండాను భుజానకెత్తుకున్న మెగాస్టార్, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారట.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణకు కూడా ఫోన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందూపూర్ సమస్యలపై పోరాడుతున్నానని, సమావేశానికి మీరు వెళ్ళమని బాలయ్య సున్నితంగా చెప్పారట. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య, ఎట్టి పరిస్థితులలోనూ జగన్ ను కలవకపోవచ్చు.
అందులోనూ ‘అఖండ’ విడుదల సమయంలో జగన్ సర్కార్ ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని పలు ధియేటర్లను సీజ్ చేయడం వంటి సంఘటనలు జరిగాయి. అలాగే టికెట్ ధరల వలన మరో 15 కోట్ల వరకు ‘అఖండ’ ఏపీలో నష్టపోయిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కట్టాయి.
టికెట్ ధరల అంశాన్ని పరిష్కరించేందుకు చిరంజీవి అంతటి వ్యక్తి ఇన్ని తంటాలు పడాలా? జగన్ అనే వ్యక్తి పాత ‘ప్రజారాజ్యం’ వ్యక్తి కాదు, అలాగే చరిత్ర చూసినా నాగార్జున – జగన్ ల మధ్య ఉన్నంత అనుబంధం కూడా జగన్ – చిరుల నడుమ లేదు.
అయినా ఎందుకు జగన్ ఎజెండా కోసం మెగాస్టార్ ఇంత తాపత్రయ పడుతున్నారో అభిమానులకు అర్ధం కాని పరిస్థితి. ఓ పక్కన రాష్ట్రంలోని ప్రజానీకం అంతా ఒక్కొక్కరుగా వైసీపీ సర్కార్ పై తిరగబడుతుంటే, చిరంజీవి లాంటి స్థాయి వ్యక్తులు మాత్రం ఏపీ సీఎంను సంతోష పేట్టేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.



