బటన్ నొక్కినప్పుడల్లా అదే పాట… మద్యలో పెళ్ళి బాజాలు దేనికో?

Jagan-Comments-On-Pawan-Kalyan-Marriagesఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు ముఖ్యమంత్రి జగనే తమ రాజకీయ ప్రత్యర్ధులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఊరుకొంటారా?

నిజానికి ఆయన సూచనలతోనే వారు పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారని ఈరోజు పార్వతీపురం జిల్లా కురుపాంలో బటన్ నొక్కుడు సభలో సిఎం జగన్‌ మాటలను బట్టి అర్దమవుతుంది.

ADVERTISEMENT

“మేము వాళ్ళలాగ దిగజారి బూతులు మాట్లాడలేము. దత్తపుత్రుడులా ప్రతీ నాలుగేళ్ళకు ఓసారి భార్యలను మార్చుకోలేము. తొడలు కొట్టి సవాళ్ళు విసరలేము. పంచ్ డైలాగులు చెప్పలేము. అబద్దాలు చెప్పలేము…” అని అన్నారు. అంటే ‘మేమందరం చాలా క్లాస్… ఆణిముత్యాలం… జాతిరత్నాలం’ అన్నట్లు జగన్‌ మాట్లాడారు.

కానీ అదే నోటితో టిడిపి, జనసేనలు దుష్టచతుష్టయం, రాక్షసమూకలు, మారీచులు, తోడేళ్ళ గుంపు, ప్రజాధనం దోచుకొనే, దాచుకొని పంచుకొని తినే దొంగలని, తాను ప్రజలకు మంచి చేస్తుంటే చూడలేక అసూయతో రగిలిపోతున్నారంటూ కసితీరా వారికి శాపనార్ధాలు కూడా పెట్టారు. పవన్‌ కళ్యాణ్‌ లారీ వేసుకొని తిరుగుతున్నాడని, కలిసి మెలిసి ఉంటున్న ఆంధ్రా ప్రజలలో కులచిచ్చుపెడుతున్నారని జగన్‌ ఆరోపించారు.

కానీ వైసీపీ మాత్రం ఓదార్పు యాత్ర, సంక్షేమ పధకాల పునాదులపై బలంగా నిలబడి ఉందన్నారు. ప్రజలనే నమ్ముకొని ఒంటరిగా ఈ రాక్షసమూకలతో యుద్ధం చేయబోతున్నానని కనుక తనకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగేళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందిపోతోందని, ఐ‌టి, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో దేశానికే మనమే ఆదర్శమని, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ప్రజలను భ్రమింపజేస్తూ, మళ్ళీ ప్రతిపక్షాలను తిట్టిపోయడం జగనన్ననే చెల్లు.

అసలు పవన్‌ కళ్యాణ్‌ వైవాహిక జీవితానికి, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు ఏం సంబంధం?రెంటినీ ముడిపెట్టి మాట్లాడటం బోడిగుండుకి మోకాలుకి ముడిపెట్టడమే కదా?

“ప్రజలకు చాలా మంచి చేశామని” పదేపదే చెప్పుకొంటున్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో వైసీపీ చేసిన ఆ మంచి ఏమిటి? దానివలన రాష్ట్రానికి, ప్రజలకు కలిగిన మేలు ఏమిటి?అని ప్రశ్నించుకొంటే…

వైసీపీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతుండటమా?ఓ చేత్తో అప్పులు ఎడాపెడా చేసి డబ్బులు పంచిపెడుతూ, మరోచేత్తో ప్రజలపై పన్నులు, చార్జీల భారం వేస్తుండటమా?

అమరావతిని పాడుబెట్టి రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలను, పెట్టుబడులను పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేయడమా?ఉద్యోగాలు, ఉన్నత విద్యల కోసం రాష్ట్రంలో యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేలా చేయడమా? ఉద్యోగ క్యాలండర్ ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతుంటే సంక్షేమ పధకాలు క్యాలండర్ ప్రకటించడమా?

చివరికి వైసీపీ నేతలు సైతం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళుతుండటమా? రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్‌ కోతలు మొదలవడమా?అయినా విద్యుత్‌ బిల్లులు బాదుడా?వంటి అనేక ప్రశ్నలు వినిపిస్తాయి.

అయితే వీటినే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం అనుకొంటోంది కనుక ఈ మేళ్ళు లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. అందుకే ప్రతిపక్ష నేతల పర్యటనలో జనాలు జేజేలు పలుకుతున్నారనే విషయం జగనన్నకు తెలియదనుకోలేము. అందుకే ఈ అసహనం… ఆవేశం… ఆందోళన! అందుకే బటన్ నొక్కినప్పుడల్లా ఇదే అరిగిపోయిన పాత రికార్డు వినిపిస్తుంటుంది. ఈసారి అదనంగా పెళ్ళి బాజాలు కూడా వినిపించాయి అంతే. మిగిలినవన్నీ సేమ్ టూ సేమ్!

ADVERTISEMENT
Latest Stories