ys-jagan-defeat

జగన్‌ తన ఓటమిని నేటికీ అంగీకరించలేకపోతున్నారు. ఈవీఎంల వలననే ఓడిపోయాము కనుక అది సాంకేతిక ఓటమే తప్ప నైతికంగా తామే గెలిచామని సర్ధి చెప్పుకుంటున్నారు. అయితే ఏ కారణంగా ఓడిపోయినా అది ఓటమే అవుతుందని దాని పర్యవసానాలు అనుభవించక తప్పదుగా?

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కేవలం 1.18శాతం తేడాతో ఓడిపోగా ఏపీలో వైసీపి ఏకంగా 15.91 శాతం తేడాతో ఓడిపోవడం ప్రజా తీర్పు కాదా? ఒక్క టిడిపితో చూసుకున్నా వైసీపికి 39.37 శాతం ఓట్లు రాగా, టిడిపికి 45.60 శాతం ఓట్లు వచ్చాయి కదా?ఇది ఓటమి కాదా?

Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!

ఒకవేళ జగన్‌ తమ ఓటమికి ఈవీఎంలే కారణమని గట్టిగా నమ్ముతున్నా ప్రజా కూటమి విజయాన్ని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పండుగలా జరుపుకోవడాన్ని చూసినప్పుడైనా, తన పాలనను ప్రజలు ఎంతగా అసహ్యించుకున్నారో అర్దం చేసుకోవచ్చు.

అదీ అర్దం చేసుకోలేకపోతే తాను ఎంతగానో అవహేళన చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నిన్న ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతి రైతులను కలిసేందుకు వచ్చినప్పుడు దారి పొడవునా వేలాదిగా ప్రజలు, రైతులు, రైతుకూలీలు, మహిళలు ఆయనకు ఎంత ఘనస్వాగతం పలికారో చూసినప్పుడైనా జగన్‌కు తాను చేసిన తప్పులన్నీ గుర్తుకు వచ్చి ఉండాలి.

Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!

ఇది వరకు మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు గడప గడపకి కార్యక్రమంలో ప్రజలు వారిని ప్రజలు ఛీరించుకునేవారు. అందుకే జగన్‌ ఎంత ఒత్తిడి చేసిన ఆ కార్యక్రమంలో పాల్గొనేవారు కాదు. కానీ ఇప్పుడు అదే ప్రజలు టిడిపి, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలకి ఎందుకు నీరాజనాలు పడుతున్నారు?

వారిలో ఏ ఒక్కరూ ఇంతవరకు ఇంకా పని మొదలుపెట్టలేదే?కానీ ప్రజలు వారికి జేజేలు ఎందుకు పలుకుతున్నారు?అని జగన్‌ ఒక్కసారి ఆలోచిస్తే హుందాగా తన ఓటమిని ఒప్పుకొని, ప్రజల తీర్పుని గౌరవిస్తున్నానని చెప్పుకునేవారు. కానీ అందుకు అహం అడ్డువస్తోంది ఆయనకు.

Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!

కనుక ఇంతకాలం 175 సీట్లు మనవేనంటూ ఏవిదంగా తన పార్టీ నేతలను మభ్యపెడుతూ వారి రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేసేశారో, ఇప్పుడు కూడా మన ఓటమికి నేను కారణం కాదు… ఈవీఎంలే కారణం అంటూ వారిని మభ్యపెడుతూ, వారి చేత కూడా ఇంకా అసందర్భ వాదనలు చేయిస్తున్నారు.

ఋషికొండ ప్యాలస్‌ గురించి గుడివాడ అమర్నాథ్, పోలవరం గురించి అంబటి రాంబాబు, ఈవీఎంల గురించి విజయసాయి రెడ్డి, శాంతి భద్రతల గురించి పేర్ని నాని మాట్లాడుతున్న మాటలే ఇందుకు నిదర్శనం.

కానీ వాలంటీర్ల చేత 5 ఏళ్ళు వెట్టిచాకిరీ చేయించుకుని వారిని ఏవిదంగా రోడ్డున పడేసిపోయారో చూసినప్పుడైనా ఇటువంటి వైసీపి నేతలకు కనువిప్పు కలిగి ఉండాలి కానీ వైసీపి నేతలెవరికీ తమ పరిస్థితి ఇంకా అర్దం కాలేదనిపిస్తోంది.

లేదా వైసీపి నేతలు జగన్‌ అండ చూసుకొని గత 5 ఏళ్ళలో టిడిపి, జనసేన, బీజేపీలతో ఆడుకున్నారు కనుక ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళేందుకు అవకాశం లేక జగన్‌తో కొనసాగక తప్పదు కనుక ఆయన చెప్పిన్నట్లుగా మాట్లాడుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.




ఓటమి నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోయినా అహంభావంతో విర్రవీగినందుకు ఎదురుదెబ్బలు తింటున్న కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీని చూసినా మారకపోతే వైసీపి నేతలను ఎవరు మాత్రం కాపాడగలరు?