ఆనాడు వాస్కోడాగామా… ఇప్పుడు మనోళ్ళు!

YS-Jagan-Infosys-Vizag

యూరోప్‌కి చెందిన వాస్కోడాగామా 15వ శతాబ్ధంలో భారత్‌ను కనుగొన్నట్లు ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి విశాఖ నగరం ఐ‌టి కంపెనీలకు అనువైనదని కనిపెట్టి చెప్పారు.

వాస్కోడాగామా భారత్‌ని కనిపెట్టకపోయినా యుగయుగాలుగా భారత్‌ ఉన్నట్లే, జగన్‌ విశాఖ ఐ‌టి కంపెనీలకు అనువైనదని కనిపెట్టకముందే అక్కడ అనేక ఐ‌టి కంపెనీలు ఉండేవి. రాష్ట్ర విభజనకు చాలా కాలం ముందు నుంచే విశాఖలో ఐ‌టి కంపెనీలు ఉండేవి.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు విశాఖని ఐ‌టి రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఎంతగానో కృషి చేస్తే, వైసీపి అధికారంలోకి వచ్చాక ఉన్న కంపెనీలన్నీ ఒకటొకటిగా హైదరాబాద్‌కు వెళ్ళిపోయాయి. విశాఖకు రావలసిన ఐ‌టి కంపెనీలు వెనక్కు తిరిగి వెళ్లిపోయాయి. కోడి… గుడ్డు… పోతే పోయాయిలే అనుకొన్నారే తప్ప ఏనాడూ పోయిన వాటి కోసం బాధపడలేదు.

అందుకే వాస్కోడాగామా భారత్‌ని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన్నట్లు, మనోళ్ళు కూడా విశాఖని మళ్ళీ మళ్ళీ కనిపెట్టి ఏపీ ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

విశాఖ, ఋషికొండలో ఐ‌టి సెజ్‌లో అనేక ఐ‌టి కంపెనీలు పనిచేసేవి. వాటిలో మౌరి టెక్ కంపెనీ కూడా ఒకటి. ఆ కంపెనీ ఉపయోగించుకొన్న భవనాన్నే ఇన్ఫోసిస్ కంపెనీ అద్దెకు తీసుకొని, ఇంతవరకు ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులతో అక్కడ తన కార్యకలాపాలు నిర్వహించుకొంటోంది. దానినే మన వాస్కోడాగామా మళ్ళీ కనిపెట్టి, నిన్న మళ్ళీ ప్రారంభించారు.

నిజానికి మన వాస్కోడాగామా ఇదొక్కటే కాదు చాలా విషయాలు కనిపెట్టారు. కానీ ప్రజలే ఆయన ఆవిష్కరణలు సరిగ్గా గుర్తించడం లేదు. శాస్త్రవేత్తలు నేటికీ విమానాలకు రివర్స్ గేరు కనిపెట్టలేకపోయారు. కానీ మన వాస్కోడాగామా మొట్టమొదటి ఆవిష్కరణే రివర్స్ టెండరింగ్!

ఆ తర్వాత ఆఫ్రికాకు మూడు రాజధానులున్నాయని, కనుక మనమూ ఏర్పాటు చేసుకొందామనే గొప్ప ఆలోచన చేసి యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కాదని అది కమ్మ సామాజికవర్గానికి మాత్రమే రాజధాని అని కనిపెట్టి చెప్పింది కూడా మన వాస్కోడాగామాయే.

అమరావతి నిర్మించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కనుక ఓ 4-5, 000 కోట్లు ఖర్చుతో విశాఖను రాజధానిగా మార్చేయవచ్చని కనిపెట్టింది కూడా మనోడే. అయితే విశాఖలో కొత్తగా ఓ నాలుగు రోడ్లు, ఓ నాలుగైదు ఫ్లైఓవర్లు నిర్మించడానికి కూడా ఆ డబ్బు సరిపోదనే విషయం ఎవరికీ చెప్పలేదు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కంటే సంక్షేమ పధకాలే బెటర్ అని కనిపెట్టింది మనోడే. రాష్ట్రాభివృద్ధి అంటే సంక్షేమ పధకాల పేరుతో జనాలకు డబ్బు పంచడమే అనే కొత్త సిద్దాంతం కనిపెట్టింది కూడా మనోడే.

తెలుగు నేర్చుకోవడం వలన పిల్లలు వెనకబడిపోతారు కనుక ఇంగ్లీషు మీడియం అవసరమని కనిపెట్టింది మనోడే. ముందుగా వారికి ఏబీసీడీలు, ఆఆఇఈలు కాదు… బైజూస్, టోఫెల్ పాఠాలు నేర్పించాలని కనిపెట్టింది మనోడే.

ఆయన స్పూర్తితోనే ‘కోడి నుంచి కోడి పుట్టదనే’ కొత్త విషయాన్ని కనిపెట్టి మనకు చెప్పారు మన మంత్రి గుడివాడ గారు. కనుక అన్ని రంగాలలో వెనకబడిపోయిన ఆంద్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే మరోసారి వైసీపిని 175/25 సీట్లు ఇచ్చి గెలిపించమని అభ్యర్ధిస్తున్నారు. అర్దం చేసుకోరూ….

ADVERTISEMENT
Latest Stories