మన తెలుగు సినీ పరిశ్రమలో హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీ సెంటిమెంట్ ఉంది. అక్కడ షూటింగ్ చేస్తే సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం. కనుక నిత్యం దానిలో షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ హిట్ అయిన సినిమాలు తక్కువే.
మన రాజకీయాలలో కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయాలి.. లేదా జైలుకైనా వెళ్ళిరావాలి. పాదయాత్ర చాలా ఖర్చు, శ్రమతో కూడినది కనుక ఏదో ఓ కేసులో జైలుకి వెళ్ళి రావడమే సులువు.
కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఓ సారి లోపలకు వెళ్ళి వచ్చేస్తున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పాదయాత్రకే మొగ్గు చూపుతున్నారు.
నేడు పర్చూరు నియోజకవర్గం పార్టీ నేతలతో తాడేపల్లి ప్యాలస్‌లో సమావేశమైనప్పుడు, “వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో నేను పాదయాత్ర ప్రారంభిస్తాను. పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వద్దాం,” అని జగన్ అన్నారు.
అంటే పాదయాత్రతో మళ్ళీ అధికారంలోకి రావచ్చునని జగన్ గట్టిగా నమ్ముతున్నారన్న మాట! పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. కనుక వారిలో నూతనోత్సాహం కలుగుతుంది. పార్టీ బలోపేతం చేసుకుంటే ఎన్నికలను ఎదుర్కోవడం తేలికవుతుంది.
కానీ వైసీపీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా తలకాయలు నరుకుతామని, అధికారుల గుడ్డలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతామని, అమరావతిని రాజధానిగా అంగీకరించమని, మావిగన్ రాజధానిగా మార్చుతానని, కూటమి ప్రభుత్వంతో వివిధ సంస్థలు చేసుకున్న ఒప్పందాలను పునః సమీక్షిస్తామని చెప్తున్నారు.
మళ్ళీ సంక్షేమ పధకాలతోనే ప్రస్తుతం ముందుకు సాగుతామని చెప్తున్నారు. ఇది వరకు అధికారంలోకి వచ్చినప్పుడే జగన్ తన తడాఖా చూపారు. ఇప్పుడు బలప్రదర్శనలతో ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ‘2.0 శాంపుల్స్’ చూపిస్తున్నారు. అంటే జగన్ 2.0 పాలన 1.0 కంటే చాలా భీభత్సంగా ఉండబోతోందని స్వయంగా చెప్పుకుంటున్నారు.
మరోపక్క కూటమి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధిపనులు పూర్తిచేస్తోంది. అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పోర్టులు తీసుకువస్తూ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.
అయినా ప్రజలు వాటిని పట్టించుకోకుండా తన పాదయాత్రని చూసి మళ్ళీ తనకు అధికారం కట్టబెట్టేస్తారని జగన్ గట్టిగా నమ్ముతున్నారన్న మాట! ఎవరి నమ్మకం వారిది. జగన్‌కి ఇలాంటి నమ్మకం ఉంటే కూటమి ప్రభుత్వానికి కూడా సంతోషమే కదా?





