YS Jagan

ఏపీ రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన హంగులన్నీ ఏర్పాటు చేసేందుకు మరో 34,964 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం సీఆర్‌డీఏ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీనిలో 5,207.47 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. కనుక రైతుల నుంచి 26,369.5 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది.

Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!

తొలి విడతలో సేకరించిన 33,000 ఎకరాలని పూర్తిగా రాజధాని అవసరాలకు ఉపయోగిస్తే, ఇప్పుడు 13 గ్రామాల పరిధిలో సేకరించబోయే 34,964 ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం కొరకు 5,000 ఎకరాలు, అంతర్జాతీయ క్రీడా నగరం కొరకు 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కొరకు 2,500 ఎకరాలు కేటాయించనున్నారు.

తొలి విడత భూసేకరణలో అమలుచేసిన ప్యాకేజీనే దీనికీ అమలుచేస్తామని మంత్రి నారాయణ ఇదివరకే చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది కూడా.

Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?

అంతర్జాతీయ విమానాశ్రయం కొరకు ప్రభుత్వం 5,000 ఎకరాలు కేటాయించబోతోంది కనుక విమానాశ్రయం ఏర్పాటుకి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా అనుమతులు సాధించాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడే పౌరవిమాన శాఖ మంత్రిగా ఉన్నందున అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకి ఆయన పాత్ర చాలా కీలకంగా మారుతుంది.

ఈ తాజా భూసేకరణపై ప్రజలలో, ముఖ్యంగా ఆ ప్రాంతాల రైతులలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి కోసం ఏడాదికి మూడు పంటలు పండే భూములను సేకరిస్తున్నప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడూ ఆ వాదనలే వినిపిస్తున్నాయి.

Also Read – వైసీపీలో టాప్ టూ బాటమ్ అందరూ ఇంతేనా?

అమరావతికి భూములు ఇచ్చిన రైతులను జగన్‌ వేధించడమే కాక 5 ఏళ్ళపాటు అమరావతిలో రోడ్లను, కట్టడాలను పాడుబెట్టి అటు రైతులకు, ఇటు రాష్ట్రానికి కూడా తీరని నష్టం చేశారు. కనుక ఒకవేళ 2029 ఎన్నికలలో మళ్ళీ జగన్‌ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటి?అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తమకు నచ్చజెప్పడానికి వస్తున్న అధికారులను, టీడీపీ నేతలను నిలదీస్తున్నారు. ఆ ప్రశ్నకు వారి వద్ద సమాధానం ఉండదు. కనుక భూసేకరణకు ముందే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ భూసేకరణ చేయబోతున్న గ్రామాల ప్రజలతో ముఖాముఖీ సమావేశమయ్యి వారికి భరోసా ఇవ్వడం చాలా అవసరం. లేకుంటే ఆగ్రహావేశాలతో ఉన్న రైతులని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ రెచ్చగొడితే ఊహించని కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.