జగన్ ముఖ్యమంత్రిగా ఇష్టారాజ్యం చేస్తున్నప్పుడు టీడీపి, జనసేన, ఆయన చెప్పే ‘ఎల్లో మీడియా’ అయన పాలనలో తప్పొప్పులను ఎత్తిచూపుతుండేవి. ఎక్కడెక్కడ ఎటువంటి తప్పులు, లోపాలు జరుగుతున్నాయో ఫోటోలు, వీడియోలతో సహా వివరిస్తుండేవి.
జగన్ రాజకీయ ధోరణి, పాలన విధానంలో లోపాలను ఎండగడుతుండేది. ఒకవేళ జగన్ అవి చెపుతున్న అంశాలపై దృష్టి సారించి, ఆ తప్పులను సరిదిద్దుకొని ఉండి ఉంటే నేటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతుండేవారు.
కానీ ఆయన సజ్జల, విజయసాయి, ఐప్యాక్ తప్పుడు సలహాలను వింటుండేవారు. రోజా, అంబటి వంటి వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా భజన పాటలనే జగన్ ఎక్కువగా లైక్ చేస్తుండేవారు.
జగన్ చుట్టూ ఏర్పడిన బలమైన కోటరీయే అయనని తప్పుదారిలో నడిపిస్తూ ప్రజలకు, పార్టీకి దూరం చేసిందని విజయసాయి రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు ఇటువంటి పొగడ్తలకు తాను పడిపోకుండా అప్రమత్తంగా ఉండేందుకు పక్కనే మద్దెల వాయించే వాడిని ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు ఆ బాధ్యతని మీడియా నిర్వరిస్తుంటే అందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ సంతోషించాలి. కానీ తమ తప్పులను ఎత్తి చూపేవారిపై బ్లూ, ఎల్లో ముద్రలు వేస్తున్నారు. అంటే కళ్ళుండి లోకాన్ని చూడకూడదనుకున్న గాంధారి లాంటివారన్న మాట మన రాజకీయ నాయకులు.
నాడు తన తప్పులు తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ఇష్టపడని జగన్, నేడు చంద్రబాబు నాయుడు తప్పులు ఎంచుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
కానీ లోపాలు, తప్పుల గురించి ఎవరు చెప్పినా విని సరిదిద్దుకోవడం చాలా అవసరం. లేకుంటే వైసీపీలాగే తుడిచిపెట్టుకుపోతారు.
ఈరోజు జగన్ ప్రెస్‌మీట్‌లో అనేక విమర్శలు, ఆరోపణలతో పాటు కొన్ని సద్విమర్శలు, ఆలోచించదగ్గ కొన్ని మాటలు చెప్పారు.
రాష్ట్రంలో కూటమి ఓ ప్రభుత్వంలా కాకుండా ఓ యాడ్ ఏజన్సీలా పని చేస్తున్నట్లుందన్నారు. గూగుల్‌తో సహా ప్రతీ దానిపై ప్రభుత్వం చాలా అతిగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. అయన మాటలు చాలా మందికి నచ్చకపోయినా అది వాస్తవమే అని అందరికీ తెలుసు.
డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించడం, ఆటో డ్రైవర్లకు 15 వేలు పంపిణీ, జీఎస్టీ తగ్గింపు… ఇలా ప్రతీ దాని ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీగా ఖర్చు చేస్తోంది. గతంలో జగన్ ఇలా ప్రచారయావతో వేలకోట్లు ప్రజాధనం వృధా చేశారని టీడీపి విమర్శించేది కదా?మరిప్పుడు అదే తప్పు కూటమి ప్రభుత్వం కూడా చేయడం దేనికి?
తలకు మించిన అప్పులు, వడ్డీల భారం, సంక్షేమ పధకాల భారం ఎలాగూ ఉండనే ఉంది. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ బకాయిలు పూర్తిగా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇంత ప్రచారం, దాని కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేయడం సమంజసమేనా?
ఉద్యోగులకు నెలనెలా ఒకటో తారీకున జీతాలు చెల్లించడం లేదు. డీఏ బకాయిలు చెల్లించలేదు. సంక్షేమ పధకాల ప్రకటనలే తప్ప చెల్లింపులు జరగడం లేదు. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ జగన్ చేసిన విమర్శలకు కూటమి ప్రభుత్వం వద్ద సంతృప్తికరమైన జవాబులు ఉన్నాయా? ఉంటే సంతోషమే.




