వైసీపి అధినేత తాను అర్జునుడినని, సింహానని, తోడేళ్ళ మూకని చీల్చి చెండాడేస్తానని చాలా గొప్పగా చెప్పుకున్నారు.
కనుక పనిలో పనిగా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల మీద గాండీవం ఎక్కుపెట్టి బాణాలు సంధించాలని, సింహంలా గర్జించాలని చెల్లి వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మోడీ, అమిత్ షా కాలర్ పట్టుకుని నిలదీసి అడగమని సూచించారు. సింహంలా గర్హించాలి కానీ వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నారని చెల్లి అడిగింది.
చెల్లి మాటలు చెవిన పడ్డాయో ఏమో, వాటి గురించే ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడేందుకు అన్నయ్య విమానం ఎక్కి ఢిల్లీకి బయలుదేరిపోయారని ఆత్మసాక్షి చెప్పింది. అయితే దేనికో అందరికీ తెలుసు.
టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకోవద్దని, ఎన్నికలలో దయచేసి వాటికి సహకరించవద్దని ప్రాధేయపడేందుకే అని అందరికీ తెలుసు. అందుకు ప్రతిగా లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీకి అవసరమైతే వైసీపి ఎంపీలతో మద్దతు ఇస్తామని నచ్చజెప్పుకునేందుకు కావచ్చు.
కానీ ఈ సందర్భంగా మూడు విషయాలు చెప్పుకోవలసి ఉంటుంది.
1. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించుకోవాలనే శ్రద్ద, పట్టుదల ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి ఉండాలి. కానీ ఇన్నేళ్ళు అడగకుండా, ఇప్పుడు
చెల్లి పోరు భరించలేక, నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంటే వాటి గురించి అడుగుతారట! నమ్మశఖ్యంగా ఉందా?ఏమైనా ప్రయోజనం ఉంటుందా?అంటే నేటికీ ఈ విషయంలో జగన్‌కు చిత్తశుద్ధి లేదన్న మాట!
2. “కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి పూర్తి మెజార్టీ లేక మనపై ఆధారపడి ఉంటేనే అది మన మాట వింటుంది. అప్పుడే ఏదైనా సాధించుకోగలము లేకుంటే సాధ్యం కాదని,” జగన్ మొన్ననే శాసనసభలో చెప్పారు. లోక్‌సభ
ఎన్నికల తర్వాత కూడా బీజేపీ మళ్ళీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని ఇప్పటికే సర్వేలు చెపుతున్నాయి. కనుక వైసీపి మద్దతు బీజేపీకి అవసరమే లేదు. మరి ఏవిదంగా విభజన హామీలను అమలు చేయించగలరు?
అంటే అందితే జుట్టు లేకుంటే పిలక అనుకోవాలన్న మాట!
3. టిడిపి, జనసేనలే కలవకుండా చేసేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేసినా ఆపలేకపోయారు. ఇప్పుడు వాటితో బీజేపీ కూడా కలవకుండా చేయాలని బయలుదేరారు. కానీ ఇప్పటికే ఆ మూడు పార్టీలు కలిసి పనిచేయబోతున్నట్లు
స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశాయి. మరి ఢిల్లీ వెళ్ళి ఏం ప్రయోజనం?
అంటే అన్నిటికీ ఒకటే సమాధానం కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న టిడిపి, జనసేనలను తట్టుకుని రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి. ఒకవేళ తట్టుకున్నా వివేకా హత్య కేసు, అక్రమస్తుల కేసు భూతాల్లా జగన్‌ను వెంటాడుతాయి.
ఇవన్నీ భరించలేక పారిపోతే వైసీపిని కాంగ్రెస్‌లో కలిపేసుకోవడానికి వైఎస్ షర్మిల సిద్దంగా ఉన్నారు. కనుక ఏదో విధంగా ఈ ఎన్నికలలో గెలవక తప్పదు. అందుకే ఈ చివరి ప్రయత్నం.
మరి మోడీ, అమిత్ షాలు మన సింహం అలియాస్ అర్జునుడు అలియాస్ ధర్మరాజుని కాపాడుతారో లేదో?






